దేశంలో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి పెరిగింది. ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఏ టీవీ చానెల్ పెట్టినా కరోనా కేసుల పెరుగుదల గురించిన వార్తా కథనాలే ప్రసారం అవుతున్నాయి. అలాగే, కరోనా మరణాలు, ఆక్సిజన్ కొరత వంటి ఇతర ప్రతికూల అంశాలనే మాట్లాడుతున్నారు. వీటిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విచారం వ్యక్తం చేశారు.
ఇది సరైన దృక్పథం కాదని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సానుకూల అంశాలను చర్చించాలని, మనకు ప్రస్తుతం రికవరీ రేట్ ఎంతో మెరుగుపడిందని, అలాంటి ఉత్సాహం కలిగించే అంశాలను ప్రస్తావించాలని రేణూ దేశాయ్ సూచించారు. తనకు తెలిసిన వాళ్లలో 70 ఏళ్ల వయసున్నవారు కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారని గుర్తుచేశారు.
ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు డబుల్ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలని కోరారు. అప్పటికీ కరోనా పాజిటివ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. మనకు ఎంతో మెరుగైన వైద్య వ్యవస్థ ఉందని, డాక్టర్లపై నమ్మకం ఉంచి చికిత్స పొందాలని రేణూ తెలిపారు.