1941లో పూణెలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అంతటి ప్రముఖ సంస్థ సాయి కుమార్ గారిని ఉగాది సందర్భంగా సత్కరించింది. 50 ఏళ్లుగా కళామతల్లికి సేవలు అందిస్తున్న సాయి కుమార్ గారిని, ఆయన సతీమణి సురేఖ గారిని సత్కరించారు. అంతే కాకుండా సాయి కుమార్ గారిని 'అభినయ వాచస్పతి' అనే అవార్డుతో సన్మానించారు. ఆంధ్ర సంఘం లాంటి సంస్థ తనను ఇలా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని సాయి కుమార్ అన్నారు.
సాయి కుమార్ ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ, నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర, చౌకిదార్ అని కన్నడలో, డీజిల్ అని తమిళంలో సినిమాలు చేస్తున్నారు. కన్యాశుల్కం, మయసభ అనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. ఇక సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ సైతం ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, శంబాల అని పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.