పాకిస్థాన్ నటీనటులపై నిషేధం ముమ్మాటికీ సబబే : కన్నడ చిత్రపరిశ్రమ

శనివారం, 15 అక్టోబరు 2016 (14:57 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించడంలో ఎలాంటి తప్పు లేదని కన్నడ చిత్రపరిశ్రమ అభిప్రాయపడింది. కళ కంటే దేశం గొప్పదని అన్నారు. తొలుత అందరం భారతీయులమని ఆ తర్వాతే కళ అని శాండల్‌వుడ్ నటీనటులు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ స్పందిస్తూ పాకిస్థాన్ నటీనటులను నిషేధించడం సరైన చర్యేనని వ్యాఖ్యానించారు. డైరెక్టర్ పవన్ ఒడయార్ కూడా నిషేధాన్ని సమర్థించారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
అదేసమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పాకిస్థాన్ నటులను నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు ఇవ్వాలని ప్రముఖ హీరోయిన్ సంజన వ్యాఖ్యానించారు. శాండల్‌వుడ్‌కు చెందిన మరో హీరో చేతన్, నిర్మాత ఎంఎస్ రమేశ్ తదితరులు కూడా పాక్ నటులపై నిషేధాన్ని సమర్థించారు. 

వెబ్దునియా పై చదవండి