పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

దేవీ

శనివారం, 26 ఏప్రియల్ 2025 (15:35 IST)
Patikella Swathimuthyam- Appaji
2000లో రాజమహేంద్రిలో శ్రీకారం చుట్టుకున్న "స్వాతిముత్యం" కల్చరల్ ఆర్గనైజేషన్, పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా... తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన, లబ్ధ ప్రతిష్టులైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు - పి.ఆర్.ఒ. లకు చిరు సత్కారం తలపెట్టింది. ఈనెల 28, సోమవారం ఉదయం 10 గంటలకు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ ఆత్మీయ వేడుకకు... హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ భవనంలోని "తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్" వేదిక కానుంది.
 
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ - రైటర్ - డైరెక్టర్ శ్రీ ప్రభు సభాధ్యక్షత వహించనున్న ఈ వేడుకలో... ప్రముఖ నటులు - నిర్మాత - మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, ఎమ్.ఎల్.సి. శ్రీమతి సురభి వాణిదేవి, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర్ శాస్త్రి, ప్రముఖ నిర్మాత - ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి) అధ్యక్షులు శ్రీ కె.ఎస్.రామారావు, ప్రముఖ దర్శకనిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు - ప్రముఖ నిర్మాత శ్రీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ తుమ్మల ప్రసన్నకుమార్, మాజీ ఎమ్.ఎల్.సి., ఎ.ఐ.సి.సి. సభ్యులు ఎమ్.సుధాకర్ బాబు, స్వర్గీయ నిర్మాత డి.వి.ఎస్.రాజు తనయుడు డి.వి.కె.రాజు, ప్రముఖ దర్శకనిర్మాత - కూచిపూడి పలావ్ సృష్టికర్త కూచిపూడి వెంకట్, ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
 
"సెల్సియస్ సిస్టమ్స్ - హోమ్ ఎలివేటర్స్ సిన్స్ 2005, ప్రొడ్యూసర్ బజార్, కూచిపూడి పలావ్, షీరో హోమ్ ఫుడ్స్, స్విస్ క్యాజిల్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్, సినేటెరియా మీడియా వర్క్స్" ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారని, "స్వాతిముత్యం" సినీ - సాహిత్య - సాంస్కృతిక - సామాజిక సేవాసంస్థ వ్యవస్థాపకుడు ధీరజ అప్పాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
 
2000 - 2004 సంవత్సరాల మధ్య "స్వాతిముత్యం, ధీరజ" పేర్లతో రాజమహేంద్రిలో "జంట మాస పత్రికలు" నిర్వహించిన అప్పాజీ, 2003లో నారా చంద్రబాబు నాయుడుపై "చుక్కల్లో చందురుడు" పుస్తకాన్ని వెలువరించారు. అలిపిరి ఘటన అనంతరం అదే పుస్తకాన్ని స్వల్ప మార్పులు-చేర్పులతో "మృత్యుంజయుడు" - Reborn to Rule" పేరుతో 5 లక్షల ప్రతులు పునర్ముద్రించి సంచలనం సృష్టించారు. రాజమండ్రిలోనే 2000 - 2004 సంవత్సరాల మధ్య పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అప్పాజీకి, ఆయన నిర్వహించిన "నవ్వుకుందాం రండి", "నవ్వండి - నవ్వించండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం" వంటి కార్యక్రమాలు విశేషమైన పేరు తెచ్చి పెట్టాయి.
 
స్ఫూర్తిదాయక విజయగాధలను అక్షరబద్ధం చేయడంలో సిద్ధహస్తుడైన అప్పాజీ... "గోరంట్ల బుచ్చయ్య చోదరి, శ్రీమతి వంగా గీత, శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి" తదితర ప్రముఖులపై వెలువరించిన ముఖచిత్ర కథనాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
 
సినిమా రంగంపై అనురక్తితో 2004లో హైద్రాబాద్ కు షిఫ్ట్ అయిన అప్పాజి... "సినిమా రిపోర్టర్"గా తెలుగు సినిమా రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి... ఆనతికాలంలోనే "ఎడిటర్"గా.. "సినీస్టార్, చిత్రాంజలి, ట్రేడ్ గైడ్" పత్రికలకు పనిచేశారు. సీనియర్ సబ్ ఎడిటర్ హోదాలో "సూర్య" దినపత్రిక సినిమా సెక్షన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన అప్పాజీ... స్వీయ సంపాదకత్వంలో సొంతంగా "స్వాతిముత్యం" సినిమా వారపత్రికను ఐదేళ్లపాటు సమర్ధవంతంగా నిర్వహించారు. కరోనా అనంతరం ప్రింటింగ్ కి స్వస్తి పలికి.. గత నాలుగేళ్లుగా డిజిటల్ డైలీ పేపర్ గా నడుపుతూ "ట్రెండ్ సెట్టర్"గా నిలిచారు. 200 పైచిలుకు చిత్రాలకు "పి.ఆర్.ఒ." గా పనిచేసిన అప్పాజీ... తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి భాగస్వామిగా "Teluguplex.com" నిర్వహిస్తున్నారు. గత పదేళ్ళ కాలంలో అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన అప్పాజీ... పలు శాటిలైట్ మరియు యూట్యూబ్ చానల్స్ లో సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణలు సైతం చేస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు