బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఇంత హిట్ అవుతుందని కల్లో కూడా ఊహించలేదని, ఏదో తెలియని మ్యాజిక్ జరిగినందుకే చిత్రం అంత భారీ హిట్టయిందని బాహుబలి కథానాయకుడు ప్రభాస్ పేర్కొన్నారు. రాజమౌళి దార్శనికతను గుడ్డిగా నమ్మామని, ప్రేక్షకులకు సినిమాలో కొత్తదనం నచ్చి ఉంటుందని, యుద్ధాలు, చారిత్రక నేపథ్యం నచ్చి ఉంటుంది కాబట్టే ప్రేక్షకులు విరగబడి చూశారని ప్రభాస్ తెలిపారు. శివుడి కాలిని కట్టప్ప నెత్తిపై పెట్టుకోవడం కథలో ఒక ట్విస్ట్ అవుతుందని అనుకున్నాను కానీ కోట్లాదిమంది కళ్లల్లో కన్నీళ్లు తెప్పించే మహనీయ దృశ్యం అవుతుందని ఎవ్వరం ఊహించలేదని ప్రభాస్ స్పష్టం చేశారు.
అదే సమయంలో నిర్మాతల క్షేమం కోరుకుంటూ షూటింగ్ జరిగినంత సేపూ భయంకరమైన టెన్షన్ అనుభవించామని, పొరపాటున అనుకున్న ఫలితం రాకపోతే నిర్మాతలు బిచ్చమెత్తుకోవలసి ఉంటుందని, నిర్మాతలను ఒడ్డున పడవేయలేం అని ఉద్రిక్త భరిత క్షణాలు షూటింగ్ పొడవునా ఎదుర్కొన్నామని ప్రభాస్ చెప్పారు. సినిమా తొలి భాగంలో మంచి ఫలితం వచ్చేసరికి చిత్రం యూనిట్ మొత్తం తాము పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందంటూ సంతోషంలో మునిగిపోయామని ప్రభాస్ తెలిపారు. సినిమా ఫ్లాప్ అయితే... వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేరు. మళ్లీ సినిమా చేసి, విడుదల చేసినా... వడ్డీలు, గట్రా ఆ ఆలోచన వస్తేనే భయంగా ఉండేదని అన్నారు.
బాహుబలి 2 షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న ప్రస్తుతం కూడా టెన్షన్‌గా ఉంది. కానీ, తొలి భాగం తీసేటప్పుడున్న టెన్షన్ ఇప్పుడు లేదు. ఓ వారం తర్వాత మెల్లగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ‘బాహుబలి’లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూశారు. పార్ట్–2లో అసలు కథ, డ్రామా, రెండు యుద్ధాలున్నాయి. మహాభారతాన్ని తలపిస్తుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనుకుంటున్నా అని బాహుబలి ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.