ఎస్పీ బాలు ఆరోగ్యం ఎలావుంది : పీఎంవో ఆరా

సోమవారం, 17 ఆగస్టు 2020 (14:11 IST)
కరోనా వైరస్ బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గానగంధర్వుడు, సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని దేశం యావత్తూ కోరుకుంటోంది. ఎస్పీబీ కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలైన విషయం ప్రధానమంత్రి కార్యాలయం వరకు చేరింది. దీంతో బాలు ఆరోగ్యం గురించి పీఎంవో ఆరాతీసింది. 
 
స్వల్ప కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బాలు.. ఆ తర్వాత ఆయనకు లక్షణాలు ఎక్కువకావడంతో ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో జనరల్ ఐసీయూ వార్డు నుంచి ప్రత్యేక ఐసీయు వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు సమాచారం. 
 
బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారట. అలాగే  ప్రభుత్వం తరపున తమిళనాడు సీఎం పళని స్వామి కూడా ఎప్పటికప్పుడు బాలు చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారట. 
 
బాలు ఆరోగ్యం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన చికిత్సం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, తన తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని, ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం శ్వాస సులభంగా తీసుకుంటున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఆదివారం రాత్రి ఓ వీడియోలో వెల్లడించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు