కరోనా వైరస్ బారినపడి జీవనపోరాటం చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలుసబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేక ఐసీయూ వార్డులో ఎక్మో సపోర్టుతో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా మారిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది.
ఈ క్రమంలో తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత సంతోషం వెలిబుచ్చారు. రెండు వారాల తర్వాత తన తండ్రిని చూశానని హర్షం వ్యక్తం చేశారు. 'నాన్న నన్ను చూసి గుర్తుపట్టారు. కొద్దిగా మాట్లాడారు. ఎలావున్నారు? అని అడిగితే బొటనవేలు పైకెత్తి చూపించారు. అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి వివరించాను.
ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను చూడడం సంతోషం కలిగిస్తోంది. నన్ను చూసి ఆయన కూడా సంతోషించి ఉంటారని భావిస్తున్నాను. ఇకపై తరచుగా వెళ్లి నాన్నను కలుస్తాను. నాన్న కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు' అంటూ ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో తెలిపారు. తన తండ్రి చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని అయితే రోజులో అధికశాతం మత్తులోనే ఉంటున్నారని వెల్లడించారు.