దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన నేపథ్యంలో బాలీవుడ్ నటి శ్రీదేవి పతాక శీర్షికల్లో నిలిచింది. ఎందుకంటే ఆ సినిమాలో శివగామి పాత్రకు గాను మొదట్లో శ్రీదేవినే ఎంచుకున్నారు. కాని రెమ్యునరేషన్ తదితర కారణాలతో శివగామి పాత్రను మిస్ చేసుకున్న శ్రీదేవి తర్వాత తమిళ కాల్పనిక చిత్ర పులిలో మరొక రాణి పాత్రలో నటించి బాహుబలికి సవాల్ విసిరింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. శివగామి పాత్రను శ్రీదేవి వదులుకోవడంతో ఆ పాత్రను అందిపుచ్చుకున్న రమ్యకృష్ణ అద్భుతంగా నటించి ప్రశంసలందుకున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా శివగామి పాత్రను శ్రేదేవి తిరస్కరించడం మాకు అదృష్టమని ఒక సందర్భంలో పేర్కొనడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఈ చర్చ శ్రీదేవి వరకు వెళ్లినా ఇంతవరకు ఆమె దీనిపై వ్యాఖ్యానించలేదు. ఇన్నాళ్ల తర్వాత శ్రీదేవి మౌనం వీడింది. బాహబలి పాత్రను తాను వదులుకోవడంపై నోరు విప్పింది. దాన్ని గురించి ఇప్పడు మాట్లాడటం దేనికి అనేసింది.
ఇటీవల తన తాజా చిత్రం మామ్ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన శ్రీదేవిని శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారని విలేకరులు రెట్టించి అడిగారు. దానికి శ్రీదేవి ఎలాంటి వివాదానికి తావివ్వకుండా సింపుల్‌గా నాలుగు ముక్కలు చెప్పి తప్పించుకున్నారు. మరొక నటి ఆ పాత్రలో నటించారు. ఆ సినిమా రెండు భాగాలూ విడుదలై హిట్ అందుకున్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడటానికి ఏముందనీ? అనేసింది శ్రీదేవి. బాహుబలి సినిమా పేరు కూడా ఎత్తకుండా శ్రీదేవి అలా అనేసరికి అంతా అవాక్కయ్యారు.
ఒకరకంగా చూస్తే ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు మాట్లాడటం అన్న శ్రీదేవి మాటల్లో కూడా పాయింట్ ఉండవచ్చు ఎందుకంటే భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయం అందుకుంది బాహుబలి. ఆ సినిమాలో నటించిన నటీనటులకు దేశమంతా నీరాజనం పలికింది. రికార్డు కలెక్షన్లతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రజెంటర్లకు లాభాల పంట పండించింది. కానీ ఇప్పుడు ఆ సినిమాలో నటించిన వారంతా తమతమ ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ సినిమాలో శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారు అని పనిగట్టుకుని ప్రశ్నించడం అవసరమా అంటోంది శ్రీదేవి.