వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె అప్పుడు దుబాయ్‌లో తన మేనల్లుడి పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో చాలా సంతోషంగా, ఉల్లాసంగా గడిపారు. ఎప్పుడూ లేనంత ఎనర్జీతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరుకావటంతో.. అందర్నీ పేరు పేరున పలకరిస్తూ వచ్చారు. బాబాయ్ ఎలా ఉన్నారు.. పిన్ని ఆరోగ్యం ఎలా ఉంది.. తమ్ముడు ఏం చేస్తున్నావ్.. అక్క బావ ఆరోగ్యం ఎలా ఉంది.. ఇలా ప్రతి ఒక్కరినీ వరుసలతో కలిపి మరీ కుశల ప్రశ్నలు వేశారు. అందరి దగ్గరకి వెళ్లి మరీ మరీ పలకరించారు. మేనల్లుడి పెళ్లిలో తనదే సందడి అయ్యింది.
పెళ్లికి కుటుంబ సభ్యులతో హాజరైన శ్రీదేవి.. కూతురు ఖుషీతో కలిసి సెల్ఫీలు దిగారు. భర్త బోనీకపూర్‌తో కలిసి ఫ్యామిలీ ఫొటోలతో సందడి చేశారు. ఎంతో ఉల్లాసంగా, సరదాగా ఉంటున్న సమంయలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చినట్లు గుర్తించిన వైద్యులు.. తక్షణం మెరుగైన వైద్య చికిత్స కూడా చేపట్టారు. అయినా జాబిలమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుంది.
అప్పటివరకు ఎంతో సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న శ్రీదేవి ఇకలేరు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడిపిన శ్రీదేవికి.. చివరికి అదే తన చివరి కార్యక్రమం అవుతుందని ఊహించలేక పోయారు.