జీవితంలో ఏ దశలోనైనా రాజీ పడకపోతే జీవితం అస్తవ్యస్థమయి తీరుతుంది కాబట్టి రాజీపడటమే జీవితంలో శాంతికి, సుఖానికి మార్గం అంటున్నారు ఈవిడ. అలాగని ఈమె ఫిలాసఫర్ కాదు. జీవితాన్ని కాచి వడబోసిన నిపుణురాలూ కాదు. కమల హసన్ గారాలపట్టి, దక్షిణాది ప్రముఖ హీరోయిన్ శ్రుతి హసన్ ఉన్నట్లుండి రాజీ పడటం అనే కాన్సెప్టు గురించి రాగం ఎత్తుకోవడం విశేషం.
ప్రస్తుత స్పీడ్ యుగంలో బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా జనం ఉంటున్నారు. త్వరగా స్నేహం చేయడం... త్వరగా విడిపోవడం, ఈజీగా ప్రేమలో పడటం... అంతే సులువుగా విడిపోవడం, ఇష్టపడి పెళ్లాడటం... చిన్ని చిన్ని మనస్పర్థలకే విడిపోవడం... మొత్తం మీద బంధాలకు విలువ లేకుండాపోతోంది. అందుకే బంధాలకు విలువ లేని కాలంలో వాటిని నిలుపుకోవడం అవసరమనుకుంటే రాజీపడక తప్పదని అంటున్నారు శ్రుతిహసన్.
‘‘కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అని అన్నారు శ్రుతిహసన్.