సుకుమార్‌గారు అలా చెప్ప‌డం హ్యాపీగా అనిపించిందిః అర్జున్ అంబ‌టి

బుధవారం, 11 ఆగస్టు 2021 (18:08 IST)
Arjun Ambati
`అర్ధనారి`లో హీరోగా, `సౌఖ్యం`లో విల‌న్‌గా మెప్పించిన అర్జున్ అంబ‌టి సుంద‌రి చిత్రంతో మ‌రోసారి న‌టుడిగా మెప్పించ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. హీరోయిన్‌ పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన‌ చిత్రం ‘సుంద‌రి’. అర్జున్ అంబ‌టి హీరోగా నటించారు. క‌ళ్యాణ్ జి గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాంచారు. ఆగ‌స్ట్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో అర్జున్ అంబ‌టి ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
- నాది విజ‌య‌వాడ‌. రెండేళ్ల పాటు ఐటీ జాబ్ చేశాను. త‌ర్వాత కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన నా స్నేహితుడు రెఫ‌ర్ చేయ‌డంతో సినిమా చేశాను. అలా క్ర‌మంగా సినిమాల్లోకి అడుగు పెట్టాను. నాకు ఎస్‌.వి. రంగారావుగారంటే చాలా ఇష్టం. మా పెద‌నాన్న‌, నాన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌. ఓ సినిమాను గుంటూరు, విజ‌య‌వాడ డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు కొనుక్కొని బాగా న‌ష్ట‌పోయారు. అలాంటి వారికి నేను మంచి జాబ్ వ‌దిలేసి సినిమాల్లోకి అడుగు పెడుతున్నాన‌ని తెలియ‌గానే బాగా తిట్టారు.
 
- భానుశంక‌ర్‌గారి `అర్ధ‌నారి` సినిమాలో ఓ డిఫ‌రెంట్ పాత్ర‌ను చేయ‌డం అదృష్టంగా భావిస్తాను. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. బాగా గ్రౌండ్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల యాక్ట‌ర్‌గా మంచి పేరు వ‌చ్చింది.
 
- డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ జి.గోగ‌ణ సోష‌ల్ మీడియా ద్వారా `సుంద‌రి` సినిమా చేయ‌డానికి న‌న్ను అప్రోచ్ అయ్యారు. నార్మ‌ల్ మూవీ అనుకుని వెళ్లి ఆయ‌న్ని క‌లిశాను. క‌థ చెప్పారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ. పూర్ణ‌గారి పాత్ర‌కు ఎక్కువ స్కోప్ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌తో పాటు స‌మానంగా పెర్ఫామెన్స్ చేసే భ‌ర్త క్యారెక్ట‌ర్‌ను చేయ‌మ‌ని అడిగారు.
 
- సుంద‌రి సినిమాలో నా పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ ఉంటాయి. పాజిటివ్‌, నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయి. పెర్ఫామ్ చేయ‌డానికి స్కోప్ ఉంటుంద‌నిపించింది. పూర్ణ‌గారి వంటి యాక్ట‌ర్‌తో క‌లిసి చేయ‌డం కూడా ఓ కార‌ణం. త‌ను చాలా మంచి కోస్టార్‌.
 
- ప‌ల్లెటూర్లో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుని సిటీకి వ‌చ్చిన త‌ర్వాత.. ఏమ‌వుతుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నే కోణంలో సినిమా సాగుతుంది.
- అర్ధనారి న‌టుడిగా నా తొలి చిత్రం. ఆ సినిమాకు మూడు నంది అవార్డులు కూడా వ‌చ్చాయి. దాని త‌ర్వాత గోపీచంద్‌గారి సౌఖ్యం సినిమాలో విల‌న్‌గా న‌టించాను. త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపు రాలేదు. మ‌ళ్లీ టీవీల్లోకి వెళ్లి అగ్నిసాక్షి సీరియ‌ల్‌లో యాక్ట్ చేశాను. దానికి చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు దేవ‌త సీరియ‌ల్ చేస్తున్నాను. మ‌ళ్లీ `సుంద‌రి` సినిమా కోసం బిగ్ స్క్రీన్‌లో న‌టించాను.
 
- సీరియ‌ల్స్‌లో ఓ క్యారెక్ట‌ర్‌ను ప్రేక్ష‌కులు ఎన్నాళ్లూ ప్రేమిస్తే.. అది సంవ‌త్స‌రాలైన కావ‌చ్చు.. దానికి లైఫ్ ఉంటుంది. పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో అలా చేసుకుంటూ వెళ్లాలి. యాక్టింగ్‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. కానీ సినిమాల్లో అలా కాదు.. సినిమా సినిమాకు వేరియేష‌న్ ఉంటుంది. వ‌ర్క్ శాటిస్‌ఫాక్ష‌న్ సినిమాల్లోనే ఎక్కువ‌గా ఉంటుంది. కానీ న‌టుడిగా దేనికైనా న్యాయం చేయాలి.
 
- నాకు హీరోగానే పేరు తెచ్చుకోవాలనేం లేదు. విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకోవాల‌నుకుంటాను. నా తొలి చిత్రం అర్ధనారిలో గే క్యారెక్ట‌ర్ చేశాను. అలాగే రెండో సినిమా సౌఖ్యంలో విల‌న్‌గా న‌టించాను.త‌ర్వాత హీరో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో న‌టించాను.
 
- ఓటీటీల వ‌ల్ల డిఫ‌రెంట్ కంటెంట్‌తో సినిమాలు చేయ‌డానికి స్కోప్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అయితే క‌చ్చితంగా నేను త్వ‌ర‌గానే స‌క్సెస్ అవుతాన‌నే న‌మ్మ‌కం ఉంది. ఇప్పుడు ఓటీటీలో యాక్ట్ చేస్తున్నాను.
 
- క‌థ విన్న‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఎలా ఉండాల‌నే దానిపై రెండు, మూడు రోజులు వ‌ర్క్ చేసుకుంటాను. త‌ర్వాత స్క్రిప్ట్‌ను బ‌ట్టి వెళ్లిపోతాను.
 
- క్ర‌మ‌శిక్ష‌ణే నా బ‌లం. సెట్స్‌లో డైరెక్ట‌ర్ చెప్పింది చేయ‌డం అల‌వాటు.
 
- పూర్ణ‌గారు మంచి న‌టి. త‌ను యాక్టింగ్‌, డాన్స్ అన్నింటిలో చ‌క్క‌గా పెర్ఫామ్ చేస్తారు. త‌న‌కెందుకు స‌క్సెస్ రాలేద‌నేది నాకు అర్థం కాలేదు. అలాగే రాకేందుమౌళి కూడా కంప్లీట్ ప్యాకేజ్డ్ ప‌ర్స‌న్‌. యాక్ట‌ర్‌, రైట‌ర్‌, పాట‌లు పాడ‌తాడు.
 
- నిర్మాత రిజ్వాన్‌గారు మంచి ఎన్విరాన్‌మెంట్‌లో సినిమాను పూర్తి చేసేలా చూసుకున్నారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించ‌రు. ఔట్‌పుట్ చూసుకుంటారు.
 
- అర్ధనారి త‌ర్వాత ఈ సినిమా న‌టుడిగా నాకు మంచి పేరు తెస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది. న‌టుడిగా మంచి పేరు తెచ్చుకునే సినిమాలు చేయాల‌ని అనుకుంటాను.
 
- `పుష్ప‌`లో ఓ రోల్ కోసం సుకుమార్‌గారు ఆడిష‌న్ చేశారు. సెల‌క్ట్ కాలేదు. కానీ ఆయ‌న అప్పుడు నాతో మాట్లాడుతూ సీరియ‌ల్‌, సినిమా అని కాదు. న‌టన ముఖ్యం అందుకే ఆడిష‌న్‌కు పిలిచాన‌ని చెప్పారు. అంత పెద్ద డైరెక్ట‌ర్ అలా చెప్ప‌డం నాకు హ్యాపీగా అనిపించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు