సైరాపై నిషేధం విధిస్తారా? సాహోకు కూడా ఆ దెబ్బ తప్పదా?

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (15:12 IST)
మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


అయితే ఇది తెలుగునాట మాత్రం కాదు.. కన్నడలో అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. 
 
ఇందుకోసం వివిధ భాషలకి చెందిన నటీనటులను ఈ చిత్రంలో ఎంపిక చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ రంగం తీసుకోబోయే ఓ నిర్ణయం 'సైరా' సినిమాకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కన్నడ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌ని కన్నడలో విడుదల చేయడం నిషేధించాలని సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట.
 
ఈ భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాల కారణంగా కన్నడలో చిన్న సినిమాల పరిస్థితి దెబ్బ తింటుందని.. దాని కారణంగా డబ్బింగ్ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ నిషేధం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే ముందుగా ఆ ఎఫెక్ట్‌ పడేది సైరా సినిమా మీదేనని సినీ పండితులు చెప్తున్నారు. ఇదే ప్రభావం సాహోపై కూడా వుంటుందని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు