మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నఈ చిత్రానికి కిక్ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా అక్కడ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారని సురేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
దాదాపు రూ.45కోట్లు ఖర్చు పెడుతున్న ఈ యుద్ధానికి అంతా సిద్ధమైందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను, ఫొటోలను సురేందర్ రెడ్డి షేర్ చేశాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, రోహిణి తదితరులు నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి రామ్‌చరణ్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. చిరు తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’కీ చరణే నిర్మాత. ఆ సినిమాలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన చరణ్‌కి బాగానే గిట్టుబాటు అయ్యింది. అందుకే ''సైరా'' బాధ్యతనీ తానే తీసుకున్నాడు. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు బడ్జెట్ వంద కోట్లే అనుకున్నారు.
కానీ అంచనాలతో పాటు బడ్జెట్ కూడా పెరిగిపోయింది. పేరున్న టెక్నీషియన్లు, నటులు వచ్చి చేరడం, చిత్రీకరణ ఆలస్యం అవుతుండడం, వర్కింగ్ డేస్ పెరుగుతుండడంతో బడ్జెట్ కూడా పెరుగుతూ పోయింది. ఇప్పుడు "సైరా" బడ్జెట్ రూ.200 కోట్ల దగ్గర ఆగింది. రూ.200 కోట్లు పెట్టగలిగే సత్తా చరణ్‌లో ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. ఇప్పుడు చరణ్ మరో నిర్మాత సహకారం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఆయనే డి.వి.వి. దానయ్య. చరణ్ - బోయపాటి చిత్రానికి దానయ్య నిర్మాత. ఆయన సైడ్ నుంచి ''సైరా''కి పెట్టుబడి పెడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.