జీఎస్టీ పన్ను విధానం పుణ్యమాని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్ ధరలు పెరిగాయి. ఫలితంగా సినీ థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. పైగా, ఈ వారం ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాకపోవడంతో వీకెండ్‌ను తమ ఇళ్ళలోనే ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు వారాంతాల్లో ఈ థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండేవి. కానీ, గత వారం రోజులుగా ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చివరకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా ఈ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి.
అదేసమయంలో టిక్కెట్ ధరను పెంచారు. రూ.100 టిక్కెట్ ధరను రూ.118గానూ, రూ.120 ధరను రూ.153గా పెంచారు. ఈ టిక్కెట్ ధరలను చూసిన ప్రేక్షకుడు బెంబేలెత్తిపోయి థియేటర్ వైపు వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఈ కారణంగా థియేటర్లు బోసిపోయి కనిపించాయి. ముఖ్యంగా వారాంతపు సెలవుల్లో కూడా థియేటర్లు ఫుల్ కాకపోవడంతో థియేటర్ యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.