తెలుగు, తమిళ చిత్రసీమల్లో అందాల ఆరబోతకే ప్రాధాన్యమిస్తారు తప్పితే నటీనటులనుంచి మంచి నటనను వెలికితేసే అవకాశాలను కల్పించబోరంటూ నటి తాప్సీ ఆరోపించారు. అమ్మాయిల అందాలను కెమెరా కంటితో జుర్రుకుని తెరపై చూపించి జనాలను కిక్కెంచాలని చూడటమే తప్ప వారినుంచి అభినయాన్ని రాబట్టాలని ఏ దర్శకుడూ ప్రయత్నించడని ఆరోపించింది. పైగా అందరూ కలిసి తీసే సినిమా ఫెయిలయితే నష్టాలకు పూర్తిగా హీరోయిన్లపైనే బాధ్యత మోపి, వారిని ఐరన్ లెగ్ అనేస్తారని, వారి అవకాశాలను అలా తొక్కి పడేస్తారనని తాప్సీ సంచలన ప్రకటన చేసింది.
తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాల్లో నటించి, ప్రస్తుతం బాలీవుడ్‌లో వెలిగిపోతున్న తాప్సీ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను. అందుకే హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే నాకు కమర్శియల్ కథా చిత్రాలు అమరలేదు. అందుకే చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్ర అపజయాలతో నాపై అచ్చిరాని నటి అని ముద్ర వేసి దూరంగా పెట్టారు. అలా చిత్ర నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు. ఇది నన్ను చాలా బాధకు గురి చేసింది అనేసింది.
చాలా కాలంగా మనసులోనే దాసుకుని అనుభవించిన మానసిక వేదన ఇది. అయితే నా కుటుంబ సభ్యులు పక్క బలంగా నిలిచారు. ఆ తరువాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టాను. అక్కడ మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. నా అభిమానులకు నేను చెప్పేదొక్కటే. ఎవరిపైనా ఆధారపడకండి. అమ్మ, నాన్న, అన్నయ్యల సహకారం కోసం ఎదురు చూడకుండా మీ అవసరాలను మీరే పూర్తి చేసుకోండి. ఎలాంటి సమస్యనైనా మీరే ధైర్యంగా ఎదుర్కోండి అని తేల్చి చెప్పేసింది తాప్సీ.
కోలీవుడ్‌లో ధనుష్ వంటి స్టార్ హీరోకు జంటగా పరిచయమైన తాప్సీకి ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, జాతీయ అవార్డులు రాబట్టుకున్నా ఈమెకు మాత్రం తెలుగులో ఏమంత ఆదరణ లభించకపోవడం గమనార్హం. నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు అని తాప్సీ చెబుతున్న దాంట్లో కాస్తయినా నిజం లేదా మరి.