తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేత, సినీ నటి దివ్యవాణి మరోమారు పాలకులను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నల వర్షం కురిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందని ఆమె మరోమారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. పైగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్‌కు ఉన్నదేంటి.. ప్రణీతకు లేనిదేంటంటూ సూటిగా ప్రశ్నించారు.
సోమవారం తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో 'తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత - ఏర్పాటు'పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నటి దివ్యవాణి పాల్గొని ప్రసంగిస్తూ, సినీ ఇండస్ట్రీలోని డ్రగ్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా, సమాజంలోని వివిధ రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యం. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఉన్నదేంటి?.. ప్రణీతకు లేనిదేంటి?. పెద్ద హీరోలతో నటించకపోవటానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి వివిధ కారణలున్నాయన్నారు.
నా కూతురు చదువుతోన్న మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సైతం డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఇలాంటి తరుణంలో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దివ్యవాణి వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.