ప్రజలను బాగా మోసం చేసే వాళ్లే గొప్ప నాయకులు అని కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, నిజాయితీ, అంకితభావంతో జీవించాలని, సత్వర ఫలితాల కోసం అడ్డుదారులు ఎంచుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
ఏది సాధించాలనుకున్నా ఓ షార్ట్ కట్ ఉంటుందన్నారు. దాంతో త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఉదాహరణకు రహదారి నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు దాటొచ్చు అని గుర్తు చేశారు. కానీ, షార్ట్ కట్ వాడారంటే అది మిమ్మల్ని షార్ట్ కట్‌గా కట్ చేస్తుందన్నారు. అందుకే మన సమాజంలో నిజాయితీ, విశ్వసనీయత, అంకితభావం, నిజం అనే విలువలు ఉన్నాయి. దీర్ఘకాలిక విజయం ఎపుడూ నిజంపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
తన దైనందిన జీవితం అంటే రాజకీయాల్లో నిజం మాట్లాడటం నిషేధమని వ్యాఖ్యానించారు. తాను పని చేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషేధం. ఎవరైతే ప్రజలను బాగా మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు అంటూ తనదైనశైలిలో చమత్కరించారు. కాగా, కేంద్రంలో కీలక పదవిలో ఉన్న నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీజేపీలోనే కాకుండా దేశ రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.