ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను.
హుస్సైనీ గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్ళేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం – ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సైనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.