వారెవ్వ 'వ‌కీల్ ‌సాబ్', పవన్ చిత్రాల్లో ఇదో మైలురాయి, డిటైల్డ్ రివ్యూ‌

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (13:34 IST)
నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు, సాంకేతిక‌త: సినిమాటోగ్ర‌ఫీ : పి.ఎస్‌.వినోద్, ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి, సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్, నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్, క‌థ‌, మార్పులు, దర్శకత్వం : శ్రీరామ్ వేణు
 
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అన‌గానే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ వుంది. మూడేళ్ళ త‌ర్వాత వ‌స్తున్న వ‌కీల్‌సాబ్‌కు పోటీగా ఏ సినిమా విడుద‌ల‌కాక‌పోవ‌డం ఒక‌టైతే, క‌రోనా వ‌ల్ల మ‌ర‌లా థియేట‌ర్ల సీటింగ్ కెపాసిటీ త‌గ్గిస్తార‌నే ప్ర‌చారం మ‌రోటి. ఇక రెండు చోట్ల బెనిఫిట్ షోలు లేకుండా నిషేధం విధించిన ప్ర‌భుత్వాలు. వెర‌సి ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైంది. ఇది అంద‌రికీ తెలిసిన అమితాబ్ చేసిన `పింక్‌` రీమేక్‌. 2016వ‌చ్చిన ఈ సినిమాను త‌మిళంలో అభిజిత్ చేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ తెలుగులో చేశాడు. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గిన‌ట్టు మార్చుకున్నామ‌ని ద‌ర్శ‌కుడు వేణుశ్రీ‌రామ్‌, నిర్మాత దిల్‌రాజు కూడా పేర్కొన్నారు. మ‌రి ఎలా వుందో చూద్దాం.
 
కథ :
జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) ముగ్గురూ స్నేహితులు. వేరేవేరే ఊళ్ళ‌నుంచి వ‌చ్చి హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ ఓ కాల‌నీలో క‌లిసి వుంటారు. ఓరోజు డ్యూటీ నుంచి కాబేర్‌లో వ‌స్తుంటే కారు బ్రేక్ డౌన్ అవుతుంది. కాసేప‌టికి ప‌ల్ల‌వి స్నేహితుడు ఓ కారులో రావ‌డం చూసి వారి ప‌రిస్థితి గ్ర‌హించి తాను వెళుతున్న రిసార్ట్‌కు తీసుకెళ‌తాడు. క‌ట్‌చేస్తే ఎం.పి. కొడుకు కంటికి గాయ‌మై ఆసుప‌త్రిలో జేర‌తాడు. దీనికి కార‌ర‌కులైన ఆ ముగ్గురిపై ప‌గ‌తీర్చుకోవాల‌నుకుంటాడు. అందుకు ఆజ్యం పోసిన‌ట్లు అతడి స్నేహితుడు తోడ‌వుతారు.

ఆ త‌ర్వాత ఆ ముగ్గురిపై వ్య‌భిచారుణులు అనే ముద్ర‌ప‌డి స‌మాజంలో చెడ్డ‌పేరు వ‌స్తుంది. ఈ స‌మ‌యంలో ఏ దిక్కూ లేని ఈ అమ్మాయిల పక్షాన‌ నిలుస్తాడు వ‌కీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). బలహీనులకు బలాన్ని ఇచ్చే వకీల్ సాబ్ ఈ అమ్మాయిలకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు? బ‌ల‌మైన లాయ‌ర్ నందా (ప్రకాష్ రాజ్)ను మరియు బ‌ల‌వంత‌మైన నిందితుల‌ను ఎలా ఢీ కొన్నాడు? అసలు పేదల వైపు నిలబడే వకీల్ సాబ్ ఎందుకు ఒంటరిగా మిగిలాడు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే.
విశ్లేష‌ణ:
పింక్ సినిమా రీమేక్‌ను య‌థాత‌థంగా తీయ‌కుండా ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గినట్లుగానే మార్చుకున్నాడు ద‌ర్శ‌కుడు. అంశం ఆడ‌వారిపై అఘాయిత్యాలు వారిపై దుష్ప్రచారం చేయ‌డం. వీటిని ఎలా లాయ‌ర్‌గా ఎదుర్కొన్నాడ‌నేది అంశం. అటు హిందీలోనూ, త‌మిళంలో వున్న కోర్టును సీన్‌ను యాజ్‌టీజ్‌గా వున్నాయి. అయితే ప‌వ‌న్‌కు రాజ‌కీయ అంశాల‌తో ముడిప‌డిన‌ట్లు కొన్ని వ‌ర్త‌మాన అంశాల‌ను ఇందులు పొందుప‌రిచారు. వంద‌ల ఎక‌రాల‌ను పేద‌ల‌కు దారాద‌త్తం చేస్తాడు సత్య.

ఆ త‌ర్వాత భోపాల్ గేస్ ఉదంతం త‌ర‌హాలో వైజాగ్‌లో జ‌రిగిన విష‌వాయు కాలుష్యం, సిటీలో రియ‌ల్ ఎస్టేట్ దందాలు సామాన్యుల ఇండ్ల‌ను ఖాళీ చేయించ‌డం. పాల‌ల‌కుపై ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడ‌డం వంటి అంశాలు ఇందులో పొందుప‌రిచారు. ఆ రెండు సినిమాల్లో హీరో భార్య మంచాన వుంటుంది. కానీ ఇందులో శ్రుతికి ల‌వ్ ట్రాక్ పెట్టి, ఆ త‌ర్వాత ఫిట్స్ వంటి అనారోగ్యంతో ఆమె మ‌ర‌ణించ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి మార్పుల‌తో పాటు క్ల‌యిమాక్స్‌లో జ‌నం కోసం మ‌నం అనే నానుడి కూడా ఇచ్చాడు.
 
ఓవరాల్‌గా అన్యాయాన్ని ఎదిరించే వ‌కీల్ సాబ్‌గా పవన్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చారు. అలాగే పవన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా నివేదా నటన చాలా బాగుంది. ఇక క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ప్ర‌కాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో చెల‌రేగిపోయారు. గెస్ట్ రోల్ లాంటి హీరోయిన్ పాత్రలో శృతిహాస‌న్ ఆక‌ట్టుకుంది. ఆమెకు సూప‌ర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది.
 
ఇందులో కోర్టు సీన్ కీల‌కం. నందా (ప్ర‌కాష్‌రాజ్‌), స‌త్య (ప‌వ‌న్‌) ఇద్ద‌రు వాదించే విధానం ఆక‌ట్టుకునే విధంగా వున్నాయి. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌లిగించాలంటే బాత్‌రూమ్‌కి వెళ్ళినా ర‌క్ష‌ణ‌గా ఎవ‌రో ఒక‌రు వుండాలి... వంటి కొన్ని డైలాగ్‌లు సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడ‌తాడు. నువ్వు  వ‌ర్జిన్‌వా.. అని అమ్మాయిని లాయ‌ర్ అడితే. అదే ప్ర‌శ్న ఎం.పి. కొడుకును ప‌వ‌న్ అడుగుతాడు. ఇలా సంద‌ర్భానుసారంగా మాట‌లు ద‌ర్శ‌కుడు రాసుకున్నాడు. ముఖ్యంగా కోర్టులో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, సమాజంలో స్త్రీలపై కొన్ని సందర్భాల్లో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను వేణు చాలా ఆసక్తికరంగా చూపించాడు. మ‌గువా మ‌గువా .. అనే పాట నేప‌థ్య‌సాంగ్‌గా వ‌స్తుంది.
మైనస్ పాయింట్స్ :
హిందీ,త మిళంలో సీరియ‌స్‌గా కోర్టు సీన్‌లు సాగుతాయి. కానీ ఇక్క‌డ ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గిన‌ట్టు మాటిమాటికీ ప‌వ‌న్ గ‌ట్టిగా అర‌వ‌డం, కోర్టు ధిక్కారం చేయ‌డం, ఎమోష‌న‌ల్ అవ‌డం వంటివి జోడించి మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే ఇంటర్వెల్‌కి గాని అసలు కథ ముందుకు కదలదు. ఇక కొన్ని కోర్టు సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు, కొన్ని సీన్స్‌ను మాత్రం నెమ్మదిగా నడిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాటిని సింపుల్‌గా నడిపారు. ఐతే ఆ సీన్స్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేసినవి కాబట్టి.. అవి ఫ్యాన్స్‌కు నచ్చినా.. రెగ్యులర్ ఆడియన్స్‌కి నచ్చవు.
 
ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్‌గా, మంచి విజువల్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సీన్స్‌ను తగ్గించి ఉంటే.. ముఖ్యంగా లవ్ సీన్స్ లోని కొన్ని సీన్స్‌ను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు కూడా ఆకట్టుకున్నాడు. 
 
తీర్పు :
ఇది కేవ‌లం ఇగో స‌మ‌స్య వ‌ల్ల వ‌చ్చిన క‌థే. మ‌నిషికి ఇగో వ‌ల్ల ఎంత న‌ష్టం క‌లిగిస్తుందో తెలియ‌జెప్పే అంశ‌మిది. ఎం.పి. కొడుకు ఆ ముగ్గురి లేడీస్‌లో ప‌ల్ల‌విని సారీ చెప్ప‌మంటే వ‌దిలేస్తానంటాడు. కానీ ఆమె వాదోప‌వాదాల‌తో మ‌రింత రెచ్చిపోతుంది. అత‌ను రెచ్చ‌గొడ‌తాడు. అలా వ్య‌భిచారిణి అనే ముద్ర‌తో మాట్లాడేస‌రికి క‌థగా మారుతుంది. ఇలా ప్ర‌తి సినిమాలో ఇగో మీద న‌డుస్తాయి. ఇది ఎల‌క్ష‌న్ల‌కు ముందు విడుద‌లైతే ప‌వ‌న్‌కు మంచి ప్ల‌స్ అయ్యేది. పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

అలాగే మంచి మెసేజ్‌తో పాటు ఇంట్రస్ట్‌గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాలో చాలా బాగున్నాయి. కాకపోతే లవ్ స్టోరీ స్లోగా సాగడం, అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా స్లోగా ఉన్నా.. ఓవరాల్‌గా ఆడియన్స్‌ను మాత్రం ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. పవన్ ఫ్యాన్స్‌కి అయితే ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తోంది. మ‌గువా మ‌గువా... నీ విలువేంటో తెలుసా.. అన్న గీతానికి త‌గిన‌ట్లు వున్న సినిమా ఇది. అంద‌రూ చూడ‌త‌గ్గ సినిమా.  అమ్మాయిలేకాదు, అబ్బాయిలు ఎలా వుండాలో తెలియ‌జేప్పే సినిమా ఇది.

రేటింగ్ 3.5/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు