యువత చూసి గర్వపడాల్సిన చిత్రం "ఘాజీ" : వెంకయ్య నాయుడు

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:02 IST)
పీవీపీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన "ఘాజీ" చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలతోపాటు.. ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకుంటూ విజయపథంలో నడుస్తోంది. రానా, తాప్సీ, కేకే.మీనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి సంకల్ప్ అత్యద్భుతంగా తెరకెకెక్కించిన విధానాన్ని చూసినవారందరూ అభినందనలతో చిత్ర బృందాన్ని ముంచెత్తుతున్నారు. అటువంటి "ఘాజీ" చిత్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా ప్రసాద్ ల్యాబ్స్‌లో వీక్షించారు.
 
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. "నేటితరం యువతకు "ఘాజీ" చిత్రం దేశభక్తిని సరికొత్త రూపంలో పరిచయం చేసింది. 1971లో జరిగిన ఇండోపాకిస్థాన్ యుద్ధం గురించి చాలా మందికి తెలియని నిజాల్ని తెలియజెప్పిన చిత్రమిది. ప్రజలు తెలుసుకొని గర్వపడాల్సిన చరిత్ర ఇది. కథానాయకుడు రానా మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన నటనతో సన్నివేశాలను పండించారు. 
 
జాతి సమగ్రతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. సబ్ మెరైన్ గురించి కానీ సబ్ మెరైన్ ఎలా పనిచేస్తుంది వంటి విషయాలను ఆకట్టుకొనే విధంగా చూపించిన దర్శకుడు సంకల్ప్‌ను మెచ్చుకొని తీరాలి. ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హింసాత్మకమైన సన్నివేశాలు ఏవీ లేకుండా "ఘాజీ" చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రశంసనీయం. అవార్డులు, రివార్డులు ఆశించకుండా ఒక మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి