అలనాటి సీనియర్ నటి జయంతి కన్నుమూత

సోమవారం, 26 జులై 2021 (10:05 IST)
దక్షిణభారత చలన చిత్రపరిశ్రమలో మరో విషాదకరఘటన సంభవించింది. ప్రముఖ సినీనటి జయంతి మృతి చెందారు. ఆమె వయసు 76 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. అయితే, ఇటీవల శ్వాససంబంధిత సమస్యతో బెంగళూరులో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చిన ఆమె సోమవారం కన్నుమూశారు. 
 
దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయంతి.. 1945 జనవరి 6న కర్ణాటకలోని బ‌ళ్లారిలో జన్మించారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు హిందీ, మరాఠీ సినిమాలతో కలిపి 5 వందలకుపైగా సినిమాల్లో నటించారు.
 
తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్‌ చక్రవర్తి, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, రక్త సంబంధం, భక్త ప్రహ్లాద, బడిపంతులు, దేవదాసు, మాయ‌దారి మ‌ల్లిగాడు, స్వాతి కిరణం, పెద‌రాయుడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
దిగ్గజ నటులు ఎంజీ రామచంద్రన్‌, ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించారు. ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. జ‌యంతి మృతి ప‌ట్ల సినీ ప‌రిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు