ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

ఠాగూర్

మంగళవారం, 19 ఆగస్టు 2025 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి మహిళల కోసం 'స్త్రీశక్తి' పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని జీరో-ఫేర్ టికెట్లతో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల మహిళలకు ఒక్క రోజులోనే రూ.7 కోట్లకు పైగా ప్రయాణ ఖర్చు ఆదా అయింది. 
 
ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత నాలుగు రోజుల్లో మొత్తం 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందారు. తద్వారా వారికి సుమారు రూ.19 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరినట్లు అంచనా వేశారు. స్త్రీశక్తి పథకం అమలు తీరు, మహిళల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం నాడు సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో మహిళల గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ పాటు, మొబైల్‌లోని డిజిటల్ లాకర్‌లో ఉన్న సాఫ్ట్ కాపీని చూపినా అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు మినహాయింపు ఉన్న ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
 
ఈ పథకం వల్ల రోజువారీ ప్రయాణాల్లో తమకు ఎంత డబ్బు ఆదా అవుతుందో మహిళలు ఎంతో సంతోషంగా వివరిస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం, ఉచిత ప్రయాణం వర్తించే బస్సులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల, బయట స్పష్టమైన బోర్డులు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు