తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్!

మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:52 IST)
తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ నటిస్తున్నారా? వెట్రిమారన్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పేశారా? మల్టీస్టారర్‌గా ఈ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించనుందా? ఇవి గత కొంతకాలంగా సోషల్‌మీడియా, మూవీ వెబ్‌సైట్స్‌లో కనిపిస్తున్న వార్తలు. అయితే, ఈ వార్తలన్నింటికీ జవాబు చెబుతూ వెట్రిమారన్‌ స్పందించారు. 
 
తాజాగా, వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'విడుదలై:పార్ట్‌-1'. ఇటీవల తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడు తెలుగులో 'విడుదల:పార్ట్‌-1' ఏప్రిల్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెట్రిమారన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో సినిమాపై స్పష్టతనిచ్చారు. అంతేకాదు, గతంలో తెలుగులో ఏయే హీరోలను కలిశారనే విషయాన్ని కూడా చెప్పారు. 'ఆడుకలం' తర్వాత తాను అల్లు అర్జున్‌ ఒకట్రెండుసార్లు కలిశాం. ‘నేను తమిళంలో సినిమా చేయాలనుకుంటున్నా. మీకు ఆసక్తి ఉంటే కథ ఉంటే చెప్పండి’ అని బన్ని అడిగారు. అప్పుడు నేను రాసుకున్న ‘వడ చెన్నై’లో ఓ పవర్‌ఫుల్‌ పాత్ర గురించి ఆయనకు చెప్పా. కానీ, ఎందుకో కుదరలేదు. తొలుత అనుకున్న వెర్షలో ఆ పాత్ర ఉంది. ఆ తర్వాత మార్పులు చేశాం. 
 
అదేసమయంలో మహేశ్‌బాబును కూడా కలిసి ఒక కథ చెప్పా. ఎందుకో ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. ‘అసురన్‌’ మూవీ తర్వాత, లాక్‌డౌన్‌ అనంతరం ఎన్టీఆర్‌‌ను కలిశా. అనేక విషయాలను మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆయనతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. అది సోలో హీరో మూవీనా, మల్టీస్టారరా? అన్న విషయం కాలమే సమాధానం చెబుతుంది. అలాగే, ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న దానిపై నాకు స్పష్టత ఉంది. స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ వాల్యూ కాకుండా మేము ఎంచుకునే కంటెంట్‌ ఫలానా స్టార్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అతనితో సినిమా చేస్తా’’ అని వెట్రిమారన్‌ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు