ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్ అందరికీ, నా ఫ్యాన్స్ కు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ, లవ్ యూ. ఆరేళ్ల కిందట నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇదే డైరెక్టర్ తో చేశాను. ఆ రోజులు వేరు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్నాడని నా గురించి మాట్లాడుకున్నారు. నా మొదటి సినిమా పెళ్లి చూపులు టైమ్ లో మీ గురించి మీరు వినాలని అనుకుంటున్న పెద్ద గాసిప్ ఏంటని అడిగితే నా సినిమా వంద కోట్ల రూపాయలు వసూళు చేసినట్లు న్యూస్ చూడాలి అన్నాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అప్పటికి. ఆ డ్రీమ్ నా నాలుగో సినిమాకే నిజమైంది. గీత గోవిందం వంద కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. వంద కోట్ల రూపాయల వసూళ్ల సినిమా అందుకోవాలి అని చెప్పిన కుర్రాడు..తన మరో సినిమా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పాడు. కానీ అందుకోలేకపోయాడు. అలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావు అని నాతో చాలా మంది అన్నారు. నీ వయసు హీరో అలా మాట్లాడితే అహంకారం అనుకుంటారు అని ప్రేమతో నాకు చెప్పిన పెద్దవాళ్లున్నారు. రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా...రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. నేను ఉదయం లేచినప్పడు, షూటింగ్ కు వెళ్లినప్పుడు, ఈ వేదిక మీద మాట్లాడేప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ఉంటా. ఇంకొకరు స్టార్ కాగా లేనిది మనం కాలేమా, మీరు కాలేరా, ఇంకొకరు రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టగా లేంది నేను ఆ ఫీట్ సాధించలేనా. పెళ్లి చూపులు నుంచి ఫ్యామిలీ స్టార్ దాకా నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక జర్నీ. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకుని మనం అనుకున్నది సాధించాలి. మనకు మన గోల్ మాత్రమే కనిపించాలి. నేను అలాగే అనుకుంటా. అదే నమ్మకంతో పనిచేస్తుంటా. మీలో చాలా మంది యాక్టర్స్, బిజినెస్ మెన్, డైరెక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్ ..ఇలా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి. నేను నా మొదటి సినిమా ప్రీ రిలీజ్ లోనే చెప్పాను. తలెత్తుకోండి, హ్యాపీగా ఉండండి. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. మాకు కష్టాలు తెలియకుండా కష్టపడ్డారు నాన్న. ఆయన మా ఫ్యామిలీ స్టార్. యూకే వెళ్లి మా అందరికీ సపోర్ట్ గా నిలిచిన మామయ్య, తమ్ముడిని యూఎస్ పంపేందుకు హెల్ప్ చేసిన మా దుబాయ్ అన్నయ్య, పెద్దమ్మ..ఇలా ఫ్యామిలీలోని చాలా మంది గుర్తుకువచ్చి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ప్రతి ఫ్యామిలీలో స్టార్ ఉంటాడు. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా నాకు దక్కడం, ఆ సినిమాను మీ ముందుకు నా ద్వారా తీసుకురావడం ఒక బ్లెస్సింగ్ లా భావిస్తున్నా. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని డైరెక్టర్ చెప్పారు. కానీ నేను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలి. ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ మా దిల్ రాజు గారు. ఆయన ఈ సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, రిలీజ్ వర్క్స్ తో పాటు ప్రమోషన్ లో మాతో అలుపులేకుండా తిరుగుతున్నారు. మాతో డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ దే. ఈ సమ్మర్ కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్. మీ ఫ్యామిలీస్ తో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.