చేతినిండా సినిమాలతో బిజీగా వున్న హీరో విజయ్ దేవరకొండ త్వరలో హిందీ సినిమాలో కూడా నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి రాజ్-డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తాజా సినిమా నోటా విడుదలకు సిద్ధమవుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెలలో తెలుగు.. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చిన శశాంక్ వెన్నెలకంటి, నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.
నోటా తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు ఆనంద్ శంకర్ తనతో మాటలు రాయించుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో మాటల రచయితగా తనకు ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ట్రైలర్లో వున్న డైలాగ్స్ తనవే.. అయితే కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రిడిట్ కూడా ఆనంద్ శంకర్ అని వేసుకున్నట్లు ఆరోపించాడు.