కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు యువ నటుడు విజయ్ దేవరకొండకు మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. విజయ్ తాజాగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం విడుదలకు ముందే అనేక విమర్శలను మూటగట్టుకుంది. అలాగే, విడుదలైన తర్వాత మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా విమర్శలు ఆగడం లేదు.
మంత్రి కేటీఆర్‌కు హీరో విజయ్ దేవరకొండ బంధువు అవుతాడని, అందుకే, ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాగుందంటూ ఆయన ప్రశంసించారంటూ వీహెచ్ చేసిన తాజా వ్యాఖ్యలపై హీరో విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించాడు. మరోమారు ‘తాతయ్యా చిల్’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.
"డియర్ తాతయ్యా, అర్జున్ రెడ్డి సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయనకు నాకు బంధువైతే.. అప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు. ఆ తర్వాత.. రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు అవుతారు. నాకు సోదరీమణులు లేరు కాబట్టి, సమంతా రూత్ ప్రభు, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు.
ఐదు రోజుల్లో 5000 ప్రదర్శనలను హౌస్ ఫుల్ చేసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు... తాతయ్యా చిల్’ అంటూ తన పోస్ట్‌లో విజయ్ దేవరకొండ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.