తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- జనసేన పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరినీ విడదీయడం ఎవ్వరివల్లా కాదని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. ప్రముఖ మీడియా ఛానల్ టీవీ9తో ఇచ్చిన ఇంటర్యూలో మాజీమంత్రి పేర్ని నాని పలు విషయాలను పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు-పవన్ మధ్య వున్న స్నేహాన్ని విడగొట్టడం ఎవ్వరివల్లా కాదు. వైసిపియే కాదు ఆఖరికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ వల్ల కూడా కాదు. చంద్రబాబు-పవన్ పార్టీలు ఒకరికొకరు కొట్టుకున్నా, కుమ్ముకున్నా ఇద్దరూ కలిసే వుంటారు. ఎంతమాత్రం విడిపోరు. దీనికి కారణం వైఎస్ జగన్. విడిపోతే జగన్ ఎక్కడ అధికారంలోకి వస్తాడోనన్న భయం అంటూ చెప్పుకొచ్చారు.
అమరావతి రాజధాని అనేది ఎప్పటికీ పూర్తికాని ఓ ప్రాజెక్టుగా వెల్లడించారు. నగరాలను ప్రభుత్వాలు నిర్మించలేవు, ఏవో ఆఫీసులను మాత్రం కట్టుకోవచ్చు కానీ ఏకంగా ఒక నగరం నిర్మించాలంటే సాధ్యమయ్యే పనికాదు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం సాధ్యమా.. ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూ పోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. దీన్నిబట్టి భవిష్యత్తులో ఒకవేళ వైసిపి అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని నగరం అటకెక్కడం ఖాయమనే అర్థమవుతుందని పలువురు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.