మస్కిలోడిస్ట్రఫీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ సహకారం అందిస్తాం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (16:46 IST)
మస్కిలోడిస్ట్రఫీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుండి తగిన విధంగా సహకారం అందించేందుకు కృషి చేస్తానని విజవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రేర్ డిసీజ్ డే సందర్భంగా సీతారాంపురంలోని ఐకాన్ పబ్లిక్ స్కూలులో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా రాయల్ సర్వీస్ ట్రస్టు వారి నిర్వహణలో మస్కిలో డిస్ట్రఫీతో బాధపడుతున్న వారికి ఐదు వీల్ చైర్లు, రెండు పవర్ వీల్ చైర్లు, ఒక ట్రై స్కూటీ శాసన సభ్యులు మల్లాది విష్ణు చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు విష్ణు మాట్లాడుతూ, అవయవాలు అన్ని ఉండి కూడా జీవనం కొనసాగించడం కష్టతరమవుతున్న తరుణంలో నడవలేని స్థితిలో మస్కిలో డిస్ట్రఫీతో బాధపడుతున్న వారు చాలా ఇబ్బందులు పడతారన్నారు.
నడవలేకుండా ఎప్పటికీ వీరు ఇంటికే పరిమితమవుతున్నారని ఈవ్యాధికి మందులేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అయితే మస్కిలో డిస్టఫీ వ్యాధి గ్రస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన విధంగా సహకారం, ప్రోత్సాహం అందే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాజిటివ్ గా ఉందని అందరి సమస్యలను పరిష్కరిస్తుందని తప్పకుండా ఈ వ్యాధి గ్రస్తులకు తన శక్తి మేరకు కృషి చేస్తానన్నారు.
రాయల్ సర్వీసు ట్రస్టు చైర్మన్ పి.పుల్లయ్య మాట్లాడుతూ, తమ ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామని అయితే మస్కిలోడిస్ట్రఫీ వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు, స్కూటీ అందించామని భవిష్యత్తులో ఏమి అవసరమైనా చేయటానికి తమ ట్రస్టు ముందుంటుందన్నారు.
అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎస్. శోభారాణి మాట్లాడుతూ మస్కిలో డిస్టఫీతో బాధపడేవారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500 మంది దాకా ఉన్నారన్నారు. మస్కిలో డిస్ట్రఫీతో బాధపడేవారు బయటకు వెళ్లలేరని బతికినంతకాలం లాక్ డౌన్ అని ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే వ్యాధితో బాధపడేవారు జీవితాంతం సంతోషంగా ఉండేందుకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహం అందించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు పెన్షన్ ఇస్తున్నారని, మందులకు చాలడం లేదని నెలకు రు.15 వేలు ఇవ్వాలని అన్నారు. అలాగే మస్కిలో డిస్టఫీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా కేర్ సెంటర్ ఏర్పాటుచేయడంతో పాటు వైద్య సేవల కోసం ప్రత్యేక హాసప్టల్, ఫిజియోథెరపీ సెంటర్ ను ఊడా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు.