హీరోయిన్ ధన్సికకు విశాల్ అండ... టి.రాజేందర్‌కు ఆ మాత్రం క్షమించే గుణం లేదా?
శనివారం, 30 సెప్టెంబరు 2017 (15:04 IST)
తమిళ యువ హీరోయిన్ ధన్సికకు తమిళ చిత్ర నిర్మాతల మండలి, హీరో విశాల్ అండగా నిలిచారు. ఆ యువ నటి చేసిన చిన్న తప్పిదంపై మండిపడిన సీనియర్ దర్శకనిర్మాత, హీరో టి.రాజేందర్‌పై విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వయసున్న టీఆర్‌కు ఆ మాత్రం క్షమించే గుణం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు ఈ వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే...
తాజాగా, "విళిథిరు" అనే తమిళ చిత్ర ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో హీరోయిన్ ధన్సికతో పాటు.. ఇతర సహానటీనటులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో ముందుగా ధన్సిక ప్రసంగంలో వేదికపై ఉన్న అందరి పేర్లను ప్రస్తావించింది. కానీ, టీఆర్ పేరును మరిచిపోయింది.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీఆర్ తన ప్రసంగంలో లేవనెత్తారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన నటించినంత మాత్రాన ఒక్కసారే పెద్దవారైపోతారా? వేదికపై వుండే వారి పేర్లు కూడా మరిచిపోతారా? అసలు ఇలాంటి కార్యక్రమాలకు చీరకట్టుకుని రావాలన్న ఆలోచన రాలేదా? అంటూ టీఆర్ మండిపడ్డారు.
ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న హీరోయిన్ ధన్సిక.. టీఆర్‌కు పదేపదే క్షమాపణలు చెపుతూ పాదాలను కూడా తాకారు. అయినప్పటికీ టీఆర్ శాంతించలేదు. ధన్సిక పేరును పదేపదే ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ధన్సిక ఏడుస్తూ వేదికను దిగి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంలో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై నటుడు విశాల్ స్పందిస్తూ, 'విళిథిరు' చిత్రమీడియా సమావేశంలో తన పేరును ప్రస్తావించనందుకు ఆ తర్వాత ధన్సిక క్షమాపణలు చెప్పినా టీఆర్ (టి.రాజేందర్) ఆమెను లక్ష్యం చేసుకున్నారు. టీఆర్ అనుభవం ఉన్న బహుళ ప్రతిభావంతుడు. సమావేశాల్లో కొందరి పేర్లను మర్చిపోయి మాట్లాడటం సర్వసాధారణ విషయం. గతంలో నేను కూడా చాలాసార్లు అలా చేశా. వేదికపై ఉన్న పెద్దలకు ధన్యవాదాలు చెప్పడం కూడా మర్చిపోయాను.
తన పొరపాటుకు ధన్సిక క్షమాపణలు చెప్పింది. టీఆర్ పాదాలు తాకింది. అయినా సరే ఆయన అదేపనిగా ఆమెను విమర్శించారు. తన కుమార్తె వయసున్న ధన్సికను టీఆర్ క్షమించలేకపోయారు. సినీ పరిశ్రమలో ఒక మహిళ రాణించడం చాలా కష్టమైన పని. ధన్సిక మంచి వ్యక్తి అని నాకు తెలుసు. టీఆర్ పేరు చెప్పకపోవడం వెనుక ఆమె మనసులో మరో ఉద్దేశం లేదని ప్రజలందరికీ తెలుసు. ధన్సిక క్షమాపణ చెప్పినా, టీఆర్ ఆమెను టార్గెట్ చేసి మాట్లాడడాన్ని నేను ఖండిస్తున్నాను" అంటూ పేర్కొన్నాడు.
అదే లేఖలో ఆమె సహనటులను ఉద్దేశించి...‘ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విదార్థ్, కృష్ణ! మీ సహనటిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన టీఆర్ ప్రసంగం పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టకూడదన్న కనీస సభ్యత మీకు ఉందనుకున్నాను. కానీ మీరు దాన్ని నిలబెట్టుకోలేదు’ అంటూ వారిపై మండిపడ్డాడు.