ఇటీవల విరాట్ కోహ్లీ గతంలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోని ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్‌మెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ కోహ్లీని రోడ్లు ఊడ్చేవాడిగా పేర్కొన్నాడు. లాహోర్‌లో పాకిస్థాన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో కోహ్లీ స్టేడియాన్ని ఊడ్చుతున్నాడని అందులో ఆ జర్నలిస్టు ట్వీట్ చేశారు.
దీనిపై కోహ్లీ అభిమానులు మండిపడుతూ, ఆస్ట్రేలియా మీడియాపై తిట్లదండకం కూడా చేశారు. ఇపుడు వీరి జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరాడు. కోహ్లీ అభిమానులు ఆ జర్నలిస్టుని విమర్శించడం సరైందేనని అభిప్రాయపడ్డాడు. అటువంటి కామెంట్ చేసినందుకు ఆ జర్నలిస్టు సిగ్గుపడాలని వ్యాఖ్యానించాడు.
ఆ జర్నలిస్టు తన గౌరవాన్ని కాపాడుకోవాలని, ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఒకరిని కించపర్చాల్సిన అవసరం ఏముందని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియన్, పాకిస్థానియన్, ఇండియన్ ఇలా మనం ఎవరయినా సరే మనమంతా మనుషులమేనని గుర్తుంచుకోవాలని హితవు పలికాడు.
పైగా, ఇలాంటి కామెంట్లపై కోహ్లీ స్పందించాల్సిన అవసరం లేదని, ఏనుగు రోడ్డుపై వెళుతోంటే ఎన్నో కుక్కలు దాన్ని చూసి మొరుగుతూనే ఉంటాయని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ ఏనుగులాంటి వాడని హర్భజన్ సింగ్ అన్నాడు.