చిరంజీవిని తప్పుబట్టిన ఆదిత్య... ఓ రీమేక్ విషయంలో పప్పులో కాలేశాడట..

మంగళవారం, 13 డిశెంబరు 2016 (10:36 IST)
దర్శకుడు వి.ఎన్ ఆదిత్య పేరు ఇప్పుడు క్రేజ్‌లో లేకపోయినా ఒకప్పుడు చాలామంది హీరోలతో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా ఆదిత్య ఉదయ్ కిరణ్ తో తీసిన 'మనసంతా నువ్వే' ఆ తరువాత నాగార్జునతో తీసిన 'నేనున్నాను' సినిమాలు సూపర్ హిట్ కావడంతో చాలామంది ఆనాటి టాప్ హీరోలు ఆదిత్యతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు.
 
అలాంటి రోజులలో మెగా స్టార్‌గా టాలీవుడ్‌ను శాసిస్తున్న చిరంజీవి ఆదిత్య దర్శకత్వంలో నటించడానికి సూత్రప్రాయం‌గా అంగీకరించాడట. దీనితో ఆదిత్య అప్పటికే కన్నడంలో సూపర్ హిట్ అయిన 'ఆప్త మిత్ర' కథను చిరంజీవికి చెప్పి ఆ సినిమాను చేయమని ఆదిత్య చెప్పడమే కాకుండా ఆసినిమా సీడీని కూడ చిరంజీవికి ఇచ్చాడట.
 
అయితే ఆ సినిమాను చూసిన చిరంజీవి ఇటువంటి కథను ఎవరు చూస్తారు అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఆ సినిమాలోని సైక్రియాటిస్ట్ పాత్ర తనకు ఏమాత్రం నప్పదు అని కామెంట్ చేసాడట. ఆ తరువాత దర్శకుడు ఆదిత్యకు వరసపెట్టి ఫెయిల్యూర్స్ రావడంతో ఆదిత్య చిరంజీవిలు చేయాలి అనుకున్న మూవీ ప్రాజెక్ట్ అటకెక్కింది.
 
అయితే ఆ తరువాత అదే 'ఆప్త మిత్రను' రజనీకాంత్ 'చంద్రముఖి' గా తమిళంలో తీసి తెలుగులో కూడ డబ్ చేస్తే ఆ సినిమా బ్లాకు బస్టర్‌గా మారిన విషయం తెలిసిందే. దీనితో సూపర్ రీమేక్ సినిమాలతో మళ్లీ ఫుల్ లెంగ్త్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న మెగాస్టార్ ఒకానొక సమయంలో ఓ రీమేక్ విషయంలో పప్పులో కాలేశాడు అంటూ ఆదిత్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం షాకింగ్‌గా మారింది.
 
దీనితో ఆదిత్య ఒకవైపు 'ఖైదీ నెంబర్ 150' విడుదలకు రెడీ అవుతుంటే ఈ కామెంట్స్ ఎందుకు చేసాడు అన్న ఆలోచనలు చాలామందికి వస్తున్నాయి. ఒకప్పుడు తనతో సినిమాను చేస్తానని మాట ఇచ్చి ఆ తరువాత మాట తప్పినందుకు చిరంజీవి పై కోపంతో ఇటువంటి కామెంట్స్ చేసాడా అని అనిపించడం సహజం. ఏమైనా ఆదిత్య మాటలకు వెనుక ఏవో అర్ధాలు ఉన్నాయి అని అనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి