''ఏ మాయ చేసావే'' జెస్సీకి కాల్ చేసిన కార్తీక్.. లాక్ డౌన్‌తో కేరళకు వచ్చేసిందట...!? (షార్ట్ ఫిలిమ్)

గురువారం, 21 మే 2020 (17:42 IST)
Karthik Dial Seytha Yenn
తెలుగులో ''ఏ మాయ చేసావే'' సినిమా తమిళం నుంచి రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తమిళంలో కార్తీక్, జెస్సీ పేరిట శింబు, త్రిష అద్భుతంగా నటించారు. తెలుగులో నాగచైతన్య, సమంత నటించారు. 
 
ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే.. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు షార్ట్ ఫిల్మ్ చేస్తూ గడుపుతున్నారు. ఇలా తాజాగా గౌతమ్‌ మీనన్‌.. శింబు, త్రిషలతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. షూటింగ్ కోసం బయట రాకుండానే.. ఈ షార్ట్ ఫిలిమ్‌ కోసం సినీ తారలు ఎవరి ఇళ్లలో వారే ఉండి దీనిని చిత్రీకరించారు. 
 
'కార్తీక్ డయల్ సైద యెన్' పేరుతో రూపొందించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో కార్తీక్‌.. జెస్సీకి ఫోన్‌ చేసి మాట్లాడతాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో జెస్సీ (త్రిష) భార్య పాత్రలో కనిపిస్తుంది. మరోవైపు కార్తీక్‌ (శింబు) లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలో ఎలాంటి పనులు లేకపోవడంతో నిరాశకు గురైన ఓ యువ దర్శకుడిగా దర్శనమిస్తారు. 
 
కథ రాయాలని భావించిన కార్తీక్‌కు జెస్సీ గుర్తుకువచ్చి.. వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి.. 'నువ్వు కేరళలో ఉన్నావని నాకు తెలుసు' అని అంటాడు. 'అవును.. నీకు ఎలా తెలుసు' అని జెస్సీ ప్రశ్నిస్తుంది. 'మాస్క్‌లు పంచుతూ ఇటీవల మీ సోదరి పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో నిన్ను చూశాను' అని చెబుతాడు. ఆ తర్వాత జెస్సీని.. భర్త, పిల్లలు, న్యూయార్క్‌ నుంచి ఇండియాకి రావడానికి గల కారణాలను కార్తీక్‌ అడిగి తెలుసుకుంటాడు. 
 
అనంతరం లాక్‌డౌన్‌ వల్ల సినీ పరిశ్రమలో తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో చెబుతూ భావోద్వేగానికి గురైన కార్తీక్‌.. 'నాకు నువ్వు కావాలి జెస్సీ', 'నీ ప్రేమ నాకు కావాలి' అని అంటాడు. కార్తీక్‌ బాధను అర్థం చేసుకున్న జెస్సీ.. 'ఐ లవ్‌ యూ కార్తీక్‌.. నువ్వు నాకో బేబి. కానీ ఇది నువ్వు అనుకున్న ప్రేమ కాదు. నీలో గొప్ప రచయిత ఉన్నాడు. నీ టాలెంట్‌ని బయటపెట్టు. మంచి కథ రాయి. త్వరలోనే థియేటర్లు ఓపెన్‌ చేస్తారు. పరిస్థితులు చక్కబడతాయి' అని ఓదారుస్తుంది. జెస్సీతో మాట్లాడి తర్వాత సంతోషంగా ఫీలైన కార్తీక్‌.. తాను అనుకున్న కథను పూర్తి చేస్తాడు.
 
తాజాగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కార్తీక్‌, జెస్సీ పాత్రల్లో శింబు, త్రిష మరోసారి మేజిక్‌ చేశారు. మధురమైన చిన్న ప్రేమకథతో గౌతమ్‌మీనన్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. షార్ట్ ఫిల్మ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు