ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, ``చిరంజీవి బృందంలో తమ చిన్న నిర్మాతలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. వాస్తవానికి ఆయనను మేము ఎంతో గౌరవిస్తాం. మా చిన్న నిర్మాతల సమస్యలను ముఖ్యమంత్రిని కలిసినపుడు చిరంజీవి తీసుకుని వెళతారని విశ్వసిస్తున్నా. ఒకవేళ ఆయన మా సమస్యలను ఏకరువు పెడితే సంతోషమే. అయినా చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ సమస్యలను 20 మందితో కూడిన బృందం వేరొకటి ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగాం. 35 జీవో అనేది చిన్న నిర్మాతల, అలాగే పరిశ్రమ పాలిట కల్పతరువు. ఎట్టి పరిస్థితులలో దానిని ఉపసంహరించరాదు అన్నది మా విన్నపం. అలాగే టిక్కెట్ రేట్స్ 100 రూపాయలు మించరాదన్నది మా మరో విజ్ఞప్తి. ఇక బి. సి. సెంటర్స్ లో మరీ తక్కువగా ఉన్న టిక్కెట్ల రేట్లను ఇంకాస్త పెంచాలి. బ్లాక్ టిక్కెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని మేము సీఎంను కోరబోతున్నాం .కొందరు పెద్ద నిర్మాతలు, ఇంకొందరు సినీ ప్రముఖులు పరిశ్రమ మనుగడ కంటే వారి కోట్ల సంపాదనే చూసుకుంటున్నారు. చిన్న నిర్మాతలను ఏ రోజు వారు పట్టించుకోలేదు. ఈ తడవ అలాంటి కుయుక్తులకు అడ్డుకట్టవేయాలన్న సంకల్పంతో మేము సీఎంను కలవాలనుకుని నిర్ణయించుకున్నాం' అని చెప్పారు.