జనసేనలో వక్తలు, కంటెంట్ రచయితలు, విశ్లేషకులుగా పనిచేసేం దుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లా నూతన నాయకులతో పవన్ ఆదివారం సమావేశమయ్యారు. సుమారు 150 మంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై పవన్‌తో చర్చించారు.
ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని ప్రకటించారు. అలాగే, ఆరు నూరైనా అనంతపురం జిల్లా నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానన్నారు.
తనను కొందరు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదంటూ విమర్శిస్తున్నారని, అసలు అలాంటివారు రాజకీయాల్లో ఎవరున్నారని ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, ఇంట్లోనే ఉండి రూ.కోట్లు సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.