తన జీవితంలో 20 యేళ్ళ స్తబ్ధుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు చెప్పారు. తనను డైరెక్షన్ వైపు వెళ్ళాల్సిందిగా హీరో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారని కానీ ఆ పని చేయలేకపోయానన్నారు. నిర్మాతగా, ఆర్టిస్టుగా తాను ఎక్కువ ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తనకు జీవితం పట్ల సరైన అవగాహన లేకే ఇలా జరిగిందనిపిస్తుందన్నారు.
ఎవరైనా వచ్చి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే మీరు బాగా నటిస్తారని చెబితే నమ్మేసే వ్యక్తిని తాను కాదన్నారు. తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని, తన అన్నయ్యను, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం చాలా తట్టుకోలేనని చెప్పారు. ఒక ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లరి చేస్తుంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ గొప్ప వాళ్ళు కాదు అని వ్యాఖ్యానించానని నాగబాబు గుర్తు చేశారు. కానీ ఆ ఒక్క మాట అని ఉండాల్సింది కాదన్నారు. తానెప్పుడు అన్నయ్య ఫ్యాన్స్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను వేరుగా చూడబోనన్నారు.
ఆ రోజు ఎమోషన్‌లో ఆ మాట జారానని ఆవేదన చెందారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏమీ చేయపోకపోయానని.. వచ్చే ఎన్నికల్లో జనసేన కోసం పనిచేయాల్సిందిగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చిన్న కబురు కూడా పెట్టలేదని నాగబాబు చెప్పారు. రాజకీయంగా ఎమ్మెల్యే రోజా విమర్శలు చేస్తుంటారే గానీ తమ ఫ్యామిలీతో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు.
రాజకీయంగా విమర్శలు చేయడం సహజమేనన్నారు. ఆరెంజ్ సినిమా వల్ల భయంకరమైన నష్టాలు వచ్చాయని, అయితే అందుకు చరణ్‌గానీ, డైరెక్టర్‌ను గానీ తాను తప్పు పట్టడం లేదన్నారు. ఆ సమయంలో ఖరీదైన ఇంటిని వదిలేసి రూ.20 వేల అద్దె ఇంటికి రావాల్సి వచ్చిందన్నారు. అప్పుడు తన అన్న, తమ్ముడు అండగా నిలబడటంతో అప్పుల ఊబి నుంచి బయటపడగలిగానని చెప్పారు. చిరంజీవి లేకుంటే నాగబాబు జీరో అన్న విమర్శలో వందశాతం నిజముందన్నారు. నిజంగానే తన అన్న లేకుంటే తాను జీరోతో సమానమేనని నాగబాబు చెప్పారు.