'ఒరు అదార్ లవ్' అనే మలయాళ చిత్రంలో 'మాణిక్య మలరాయ పూవై' అనే పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఈ సీన్‌తో ప్రియకు ఎంత స్టార్‌డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వాటిలో హైదరాబాద్‌లో కూడా ఓ కేసు ఉంది.
అయితే, కన్నుగీటుతో మొత్తం ప్రపంచాన్ని కట్టిపడేసిన ప్రియా వారియర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం ఊరట ఇచ్చింది. ప్రియాపై వేసిన పోలీసు కేసును సుప్రీంకోర్టు కొట్టేసి, ప్రథమ సమాచార నివేదికను రద్దుచేసింది. అంతేకాకుండా పోలీసులకు బాగా చురకలంటించింది. తమ మతం కన్నుకొట్టడాన్ని అనుమతించదంటూ ముఖీత్ ఖాన్, జహీరుద్దీన్ అలీఖాన్ అనే ఇద్దరు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ పాటతో మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆమెపై, దర్శకునిపై కేసుపెట్టారు.
దీన్ని ఆధారంగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో ఎవరో ఏదో పాట పాడుతారు. మీకు కేసు నమోదు చేయడం తప్ప వేరే పనేమీ లేదా..? అని పోలీసులకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా చురకలంటించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్టుగా ప్రియకు ఇవేమీ వర్తించవని కోర్టు వెల్లడించింది. కాగా, సోషల్ మీడియాలో ఈ సాంగ్, ప్రియ అభినయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు 'ఒరు అదార్ లవ్' సినిమా సెప్టెంబర్ 14వ తేదీన విడుదలకానుంది.