శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్ళొచ్చు.. ప్రైవేట్ ప్రాపర్టీ కాదు: సుప్రీం

బుధవారం, 18 జులై 2018 (18:44 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. పురుషులతో పాటు మహిళలకూ కూడా సమాన హక్కులున్నాయని సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా గుర్తు చేసింది.
 
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం మహిళా హక్కులకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. శబరిమల ఆలయంలోకి ఎవరైనా వెళ్లొచ్చని ఆలయాలు ప్రైవేట్ ప్రాపర్టీ కాదని పబ్లిక్ ప్రాపర్టీ అని సుప్రీం తేల్చి చెప్పింది. ఆలయాల్లోకి వెళ్లి ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 
 
ఏ ఆలయంలోనైనా దేవుడిని పూజించే హక్కు మహిళలకు వుందని.. అది రాజ్యాంగబద్ధమైన హక్కు అంటూ సుప్రీం కోర్టు వెల్లడించింది. 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు, యువతులు, మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ వేసిన పిటిషన్లపై బుధవారం  సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. 
 
అందరికీ ఆలయంలోకి ప్రవేశం కల్పించాల్సిందేనంటూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. గత అక్టోబర్‌లో ఈ వివాదాస్పద పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అయ్యప్పను దర్శించుకునే అవకాశం మహిళలకు దక్కినట్లైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు