ప్రముఖ మరాఠా కవి భక్త తుకారాం రచనలు ఇప్పుడు ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లిథువేనియన్ ప్రజలు తుకారాం కవిత్వానికి పట్టం గట్టడాన్నే.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన రచనలు ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, డచ్, జర్మన్, ఇస్పెరండో, స్పానిష్, పోలిష్ బాషల్లో ప్రచురితమయ్యాయి.
ఇప్పుడు తాజాగా... యూరప్ ఖండంలోని లిథూనియా దేశ మాతృభాష అయిన లిథువేనియన్లోకి భక్త తుకారాం కీర్తనలు, ఇతర గ్రంథాలు తర్జుమా అయ్యాయి. మూడు శతాబ్దాల తరువాత కూడా వాడిపోని తుకారాం "భక్తి తత్వానికి" సర్వమానవాళి నీరాజనాలు పలకడం ఇదే మొదటిసారేమీ కాదు.
17వ శతాబ్దంలో భక్తి ఉద్యమాలకు చిరునామాగా నిలిచిన తుకారాం... నాటి సమాజంలోని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పేదసాదల భాగ్యోదయాన్ని ఆకాంక్షిస్తూ తన రచనల్లో వ్యక్తపరిచారు. అన్ని కాలాలకు పనికివచ్చే సూక్తిసుధను మానవాళికి ఆ రకంగా పంచారు. ఈ కారణంగానే ప్రపంచం ఆయన రచనలతో మమేకం అవగలుగుతోంది.
ఇదిలా ఉంటే... ఏ సంస్కృతి, ఏ సమాజానికయినా వర్తించే కవిత్వంగా తుకారం రచనలను.. ప్రముఖ కవి దిలీప్ చిత్రే అభివర్ణించారు. కాగా... దిలీప్ చిత్రే, తుకారాం రచనలను ఇంగ్లీష్ బాషలోకి అనువదించటంలో ముఖ్య పాత్రను పోషించారు.