నెల్లూరులో "నంది నాటకోత్సవం"

బుధవారం, 14 జనవరి 2009 (13:59 IST)
జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో "నంది నాటకోత్సవం-2008" జరుగనుంది. ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర సమాచార శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ... నంది నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 ఎంట్రీల నుండి 32 నాటకాలను ఈ ఉత్సవాలకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.

వీటిలో ఉత్తమ నాటకాలుగా ఎంపికైన వాటికి 24వ తేదీన జరిగే సభలో నంది బహుమతులను ప్రదానం చేస్తామని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఉత్సవాల నిర్వహణకుగానూ 26 లక్షల నిధులతో కస్తూరిబా కళాక్షేత్రానికి మెరుగులు దిద్దినట్లు ఆయన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి