ఇది రాజమౌళి, ప్రభాస్, బాహుబలి నిర్మాతలు, చిత్ర యూనిట్ అందరూ కలిసి పండుగ చేసుకోవలసిన వార్త. ప్రపంచ సినిమా పరిశ్రమలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు బాహుబలి. బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగానే బాహుబలి2 టీజర్, ట్రైలర్ సాధించిన అద్బుతమైన హిట్లతో అభిమానులు అయితే బాహుబలి 2వ భాగం గ్యారంటీగా సూపర్ హిట్ అని ముందే స్థిరం చేసుకున్నారు.
కానీ మరో కోణం నుంచి బాహుబలి-2 మూవీ టాక్ లీక్ కావడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్విట్టర్ ద్వారా బాహుబలి2 టాక్‌ను లీక్ చేశాడు. బాహుబలి బిగినింగ్‌తో పోలిస్తే, బాహుబలి కంక్లూజన్ వంద శాతం అద్భుతమని, టాలీవుడ్, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు. ఉమైర్ సంధు కొంతకాలంగా పెద్ద సినిమాల ఫై రిలీజ్‌కు ముందే తన రివ్యూను తెలియజేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. వాటిలో కొన్ని నిజం కొన్ని అబద్దం అవుతున్నాయి.
అయితే ఉమైర్ సంగతి పక్కనపెడితే బాహుబలి2 సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవటమే కాకుండా తొలి రోజే 100 కోట్లను కొల్లకొట్టి.. వెయ్యికోట్ల క్లబ్‌లో చేరొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. చిత్రం విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ పనుల్లో ఉండిపోయింది.