ఆ క్యారెక్టర్‌ కార్తీక మాత్రమే చేయగలదని... దర్శకుడు బి.చిన్ని

శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:31 IST)
'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రంలో నరేష్‌తో పోటీపడి మరీ నటించే పెంకి చెల్లెలి పాత్ర కోసం ఎవర్ని ఎంపిక చేయాలా అని తర్జనభర్జనలు పడుతున్న తరుణంలో.. మా హీరో అల్లరి నరేష్‌గారు.. 'ఈ పాత్రకి కార్తీక అయితే కరెక్ట్‌గా సరిపోతుంది, ఒకసారి చూడండి' అన్నారు. ఆయన రిఫరెన్స్‌తో కార్తీకను నరేష్‌ ట్విన్‌ సిస్టర్‌గా సెలక్ట్‌ చేసి.. షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. మేం అనుకున్నదాని కంటే వందరెట్లు అద్భుతంగా నటించింది కార్తీక. ముఖ్యంగా నరేష్‌తో పోటీపడి మరీ కార్తీక పండించిన కామెడీ చాలా వైవిధ్యంగా ఉండడంతో పాటు.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది' అంటున్నారు 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్ర దర్శకులు బి.చిన్ని.
 
ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం విశాషాలను గురించి చిత్ర దర్శకుడు బి.చిన్ని మాట్లాడుతూ... 'ఇప్పటివరకు నరేష్‌ సినిమాల్లో.. కేవలం నరేష్‌ మాత్రమే కామెడీ చేయడం మనం చూసాం.. కానీ 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రంలో నరేష్‌తోపాటు కార్తీక కూడా అద్భుతంగా కామెడీ పండించింది. 
 
ముఖ్యంగా.. ఈ చిత్రంలో ఆమె చేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌, డూప్‌ కాదు కదా.. కనీసం రోప్‌ హెల్ప్‌ కూడా లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు మా చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కార్తీక పాత్రను తెరపై చూస్తున్నంతసేపూ మన ఇంట్లో ఉన్న అల్లరిపిల్ల మనకు గుర్తుకు వస్తుంది. హిలేరియస్‌ కామెడీకి సిస్టర్‌ సెంటిమెంట్‌ కలగలిపి రూపొందుతున్న 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రంలో అల్లరి నరేష్‌-కార్తీకల మధ్య బ్రదర్‌-సిస్టర్‌ బాండింగ్‌ చాలా చక్కగా కుదిరింది. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు' అన్నారు.
 
ఈనెలలో ఆడియోను విడుదల చేసి.. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి తెలిపారు. హర్షవర్ధన్‌ రాణె, బ్రహ్మానందం, ఆలి, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, అభిమన్యు సింగ్‌, కెల్లీ డార్జ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్‌ రిలేషన్స్‌: వంశీ- శేఖర్‌, ఎడిటర్‌: గౌతమ్‌రాజు, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: విజయ్‌కుమార్‌ అడుసుమిల్లి, కథ: విక్రమ్‌ రాజ్‌, కార్యనిర్వహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి.చిన్ని!

వెబ్దునియా పై చదవండి