ప్రపంచ వ్యాప్తంగా 1500కు పైగా స్ర్కీన్‌లపై రేపటి నుంచి ప్రదర్శితం కానున్న ‘కురుప్‌ ’

గురువారం, 11 నవంబరు 2021 (13:55 IST)
వాస్తవ జీవితపు స్ఫూర్తితో తీర్చిదిద్దబడిన క్రైమ్‌ డ్రామా ‘కురుప్‌’. భారతదేశ వ్యాప్తంగా అభిమానులు కలిగిన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా నవంబర్‌ 12,2021న  విడుదల కాబోతుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత దాదాపుగా పేరొందిన నటులందరూ కూడా తమ చిత్రాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ఆసక్తి చూపతున్న కాలంలో ‘కురుప్‌’ను 1500కు పైగా స్ర్కీన్‌లలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు.
 
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కురుప్‌’, మహమ్మారి అనంతర కాలంలో సినిమా థియేటర్‌లలో సినీ వీక్షణ అనుభవాలను ‘కురుప్‌ ’ మరింతగా వృద్ధి చేయనుంది. మహమ్మారి కారణంగా సినీ రంగం సంక్షోభంలో పడిన వేళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అట్టహాసంగా విడుదల కాబోతున్న రెండవ దక్షిణ భారత చలన చిత్రం ‘కురుప్‌’. అంతేకాదు, భౌగోళిక సరిహద్దులను అధిగమించిన మొట్టమొదటి మలయాళ చిత్రం కూడా ఇది.
 
భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నేరగాడు సుకుమార కురుప్‌ జీవితగాధ ఆధారంగా దీనిని రూపొందించారు.  ఈ చిత్రానికి శ్రీ నాథ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. ఈ క్రైమ్‌ డ్రామాలో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీవేన్‌, షైన్‌ టామ్‌ చాకో, శోభిత ధూళిపాళ్ల, అనుపమ పరమేశ్వరన్‌, శివజిత్‌ పద్మనాభన్‌ ముఖ్య తారాగణం.
 
దుల్కర్‌ సల్మాన్‌ సొంత నిర్మాణ సంస్ధ వేఫారర్‌ ఫిల్మ్స్‌ తో పాటుగా ఎం-స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సహ నిర్మాతలుగా వ్యవహరించిన ‘కురుప్‌’ చిత్ర విడుదల కోవిడ్‌ కారణంగా పలు మార్లు వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేయాలని భావించినప్పటికీ, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి సలహామేరకు ఈ చిత్ర నిర్మాతలు  థియేటర్‌లో చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు.
 
‘‘థియేటర్‌లో కురుప్‌ విడుదల చేయాలనే మా నిర్ణయానికి సానుకూల స్పందన వస్తుంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, సినీ వీక్షకులు మా ప్రయత్నాలను అభినందించడంతో పాటుగా మంచి సినిమాను ఆదరిస్తుడటం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆకట్టుకునే కథనంతో రూపుదిద్దుకున్న కురుప్‌,  మహమ్మారి అనంతర కాలంలో వెండి తెరపై సినీ వీక్షణ పరంగా ఆసక్తిని రెట్టింపు చేయనుందని ఆశిస్తున్నాము’’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు.
 
దుల్కర్‌ సల్మాన్‌ మరియు శ్రీనాధ్‌ రాజేంద్రన్‌ సంతకం చేసిన ప్రింటెడ్‌ పోస్టర్‌, డిజిటల్‌ ఆర్ట్‌వర్క్‌ సహా మూడు నాన్‌ ఫంగిబల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీలు) విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రం ‘కురుప్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్‌ 10వ తేదీన ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా వద్ద ప్రదర్శించారు. తద్వారా ఈ భవంతిపై ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్రకెక్కింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు