వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య...

ఠాగూర్

శుక్రవారం, 8 ఆగస్టు 2025 (17:58 IST)
తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
షామ్లీ జిల్లాలో జరిగే తన బావమరిది పెళ్లికి తన భార్య మైఫ్రీన్‌తో కలిసి మోటార్ సైకిలుపై వెళ్తుండగా మోటార్ సైకిలుపై వచ్చిన ఇద్దరు యువకులు షహనవాజ్ (28)ను అడ్డగించి దాడిచేశారు. లాఠీలతో కొట్టి, కత్తితో పలుమార్లు పొడిచారు. ఆపై నిందితుల్లో ఒకడు తుపాకితో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన షహనవాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
 
ఈ ఘటనపై షహనవాజ్ భార్య మైఫ్రీన్ కైరానా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కోసం షహనవాజ్ తీసుకెళ్తున్న రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లతో చేసిన దండ, అతడి బైక్ కనిపించకపోవడంతో ఇది దోపిడీ కోసం జరిగిన హత్యగా పోలీసులు భావించారు. అయితే, పోలీసులు బైక్‌ను ఆ సమీపంలో గుర్తించడంతో ఇది దోపిడీ కాదని నిర్ధారించారు.
 
పోలీసుల దర్యాప్తులో షహనవాజ్ భార్య మైఫ్రీన్, ఆమె ప్రియుడు తసవ్వర్ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది. తసవ్వర్ షహనవాజ్‌కు దగ్గరి బంధువు కూడా. తన భార్యకు తసవ్వర్‌తో వివాహేతర సంబంధం ఉందని షహనవాజ్‌కు తెలుసు. దీనిని అతడు తీవ్రంగా వ్యతిరేకించడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. అందులో భాగంగానే మరో ముగ్గురితో కలిసి అతడిని హత్య చేయించినట్టు పోలీసులు తెలిపారు.
 
ఈ కేసులో తసవ్వర్, మరొక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగిలిన నిందితులు, షహనవాజ్ భార్య మైఫ్రీన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మైఫ్రీన్ పరారీలో ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు