రెండోభాగం సినిమా చూస్తే 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న మర్చిపోతారట..!
శుక్రవారం, 17 మార్చి 2017 (06:05 IST)
దేశం, ప్రపంచం నలుమూలలా ఉన్న బాహుబలి అభిమానులు గురువారం విడుదలైన ట్రైలర్ చూసి ఫిదా అయిపోతుంటే ఇన్నాళ్లుగా యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు అంత సీన్ లేదనేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు రెండో భాగం సినిమాలో ఎంత సేపటికి సమాధానం వస్తుంది అన్ని మీడియా అడిగిన ప్రశ్నను లైట్ తీసుకుంటూ బాహుబలి సినిమా రెండో భాగం థియేటర్లో విడుదలయ్యాక చూస్తున్న క్రమంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నే మర్చిపోతారు అనేశారు. కట్టప్ప ప్రశ్న ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకురావడం వరకే. ఒక్కసారి థియేటర్‌లోకి వచ్చిన తరవాత ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అంటూ ఇంకా హైప్ పెంచేలా మాట్లాడారు రాజమౌళి. గురువారం చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండో భాగంలో కథలోని పాత్రలు సవివరంగా ఆవిష్కృతమవుతాయని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ చిత్రం గురించి రాజమౌళి మాటల్లోనే విందాం.
ఓ సినిమాని విశ్రాంతి వరకూ చూసి, ద్వితీయార్ధం ఎలా ఉంటుందో వూహించడం పరిపాటే. కొంతమంది సినిమా మొదలైన పావుగంటకే కథంతా చెప్పేస్తుంటారు. ‘రామాయణం’, ‘మహాభారతం’ కథలు మనకు తెలుసు. అయినా వాటిని తెరపై చూస్తున్నప్పుడు ఏమాత్రం ఆసక్తి సడలదు. కథంతా తెలిసినా దాన్ని ఎంత అందంగా చూపించారన్నదే ముఖ్యం.
బాహుబలి’ అంతా ఒకటే కథ. ఇదంతా రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నాం కాబట్టి రెండు భాగాలుగా తీశాం. తొలి భాగం విడుదలకు ముందే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’కి సంబంధించిన కొంత భాగం తెరకెక్కించేశాం. కాబట్టి కథ పరంగా ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే యాక్షన్ ఘట్టాలు కాస్త పెరిగాయంతే. ఇంకాస్త నాటకీయంగా చెప్పే ప్రయత్నం చేశాం.
రెండో భాగంలో నాలుగు క్లైమాక్సులు తీశారని, అందులో ఒకటి మాత్రమే చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంత సీన్ లేదు. ఒక క్లైమాక్స్ చేసేసరికే మా ఓపిక అంతా అయిపోయింది. కథా చర్చల్లో చాలా రకాల ఆలోచనలు వచ్చాయి. షూటింగ్‌కి వెళ్లక ముందే... క్లైమాక్స్ లాక్ చేశాం. మేం తీసింది ఒకే క్లైమాక్స్.
శివలింగాన్ని ఎత్తుకొని జలపాతంలో దూకినప్పుడే శివుడు ఎంత బలవంతుడో చూపించేశాం. దున్నపోతుని ఒట్టి చేతులతో మట్టికరిపించినప్పుడే బల్లాలదేవ ఎంత శక్తిమంతుడో తెలిసిపోయింది. వీరిద్దరూ శత్రువులు అన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. వాళ్ల మధ్య పోరాటం తప్పకుండా ఆకట్టుకొంటుంది. ‘బాహుబలి 2’ను శిఖరాగ్రాన కూర్చోబెట్టే అంశం అది.
‘బాహుబలి’ కథలో అన్నీ శక్తిమంతమైన పాత్రలే. వాళ్లు నమ్మిన సిద్ధాంతాన్ని చాలా గట్టిగా పాటిస్తారు. వాళ్ల మధ్య బంధం, ప్రేమ, పగ అన్నీ అంతే శక్తిమంతంగా ఉంటాయి. దేవసేన పాత్రని మహిళలంతా ఇష్టపడతారు.
బాహుబలి 2 విడుదలయ్యాక కొన్ని రోజులవరకూ సినిమా గురించే ఆలోచించకూడదు అనుకొంటున్నా. ‘బాహుబలి’ ప్రపంచం నుంచి బయటకు వెళ్లిపోవాలి. తదుపరి విజవల్ ఎఫెక్ట్స్‌తో పనిలేని సినిమా చేయాలనుకొంటున్నా.
సినిమా ప్రారంభమైన 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. కొందరు అనుకున్నది నిజం కావచ్చు. కాకపోవచ్చు. కానీ కథను ఎంత చక్కగా చూపామన్నదే ముఖ్యం. రెండో భాగానికి సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన వివిధ వూహలు తప్పు. కొన్ని మాత్రం దగ్గరగా ఉన్నాయి. కథ గురించి అందరికీ తెలిసినా నాకేం బాధలేదు.
చాలా తక్కువ మార్పులు చేశాం. బాహుబలి తొలిభాగం అయిన తర్వాత రెండో భాగం తీయడం కాదు. ఒకే కథ. సినిమా అనుకున్నప్పుడే రెండు భాగాలు అనుకున్నాం. తొలిభాగం విడుదలైన తర్వాత దానికి వచ్చిన సమీక్షలను దృష్టిలో పెట్టుకుని రెండో భాగంలో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మార్పులు చేశాం. ప్రాథమికంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. 30శాతం వరకూ ముందే షూట్ చేశాం.
చిన్నప్పటి నుంచి చూసిన ప్రతీ సినిమా, కథ నాకు స్ఫూర్తి. తొలి నుంచే ఇది ఉండేది. ప్రతీ దర్శకుడిలో సినిమా కథలో రామాయణ, భారత కథలు స్ఫూర్తి కచ్చితంగా ఉంటుంది. సినిమా ఓ స్థాయి వెళ్లాలంటే అన్ని విభాగాల నుంచి సహకారం ఉండాలి. ‘బాహుబలి’ని అందరూ ఇది తమ సినిమా అనుకుని చేశారు. మీడియా కొన్ని సార్లు మాపై విమర్శలు రాసినా, చిత్రంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు. శిఖరస్థాయిలో నిలబెట్టారు.
బాహుబలి 2ని ఆకాశానికెత్తిన దర్శకేంద్రుడు
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘ఇలాంటి అద్భుతాన్ని నా సమర్పణలో ఆవిష్కరిస్తారని జన్మలో అనుకోలేదు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్ రాజమౌళి. మీ చిత్ర బృందమంతా ఎంతో అదృష్టవంతులు. ట్రైలర్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇక సినిమా కోసం నెలరోజులు ఆగాలంటే పరిస్థితి ఏంటో. నేను మాత్రం రోజుకు పదిసార్లు దీన్నే చూస్తా. ఇంతకన్నా మాట ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. సాహో.. సాహోరే బాహుబలి’ అని అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ కావడం వాన అయితే.. ట్రైలర్ ఉరుములాంటిది. నా లాంటి వాడికి వానలో తడిస్తేనే ఆనందం. త్వరలోనే అందరం ఆ వానలో తడుస్తాం’ అని అన్నారు.
రానా మాట్లాడుతూ.. ‘రాఘవేంద్రరావు గారు అన్నట్లు మాటలు రావడం లేదు. నటుడిగా నాకు ఏడేళ్లు అయితే ఐదేళ్లు ఇక్కడే అయిపోయాయి. మహిష్మతి లాంటి గొప్ప సామ్రాజ్యాన్ని ఏప్రిల్‌లో మీరు చూస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇందులో నన్ను భాగస్వామిని చేసింనందుకు రాజమౌళికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.