సంగీతం: సందీప్‌చౌతా,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వై.వి.ఎస్. చౌదరి,
బేనర్: లక్ష్మీ ప్రసన్న, రిలయన్స్ బిగ్ సినిమా,
కెమెరా: రాంప్రసాద్.
కొన్ని సినిమాలు మొదట్లోనే ఎలా ఉంటాయో ముందే తెలిసిపోతాయి. రెండేళ్లుగా సినిమా తీస్తూ మధ్యమధ్యలో విష్ణు పెళ్లి, ప్రకృతి వైపరీత్యాలు, ఇలియానాకు చిన్న యాక్సిడెంట్‌తో కాలు విరగడం వంటి దుస్సంఘటనలు సలీమ్ సినిమాపై ప్రభావం చూపాయి. అంతకుముందే తాను తీసింది "ఒక్క మగాడు" మహా మహా చిత్రమని చతికిలిపడ్డ వై.వి.ఎస్. చౌదరి.. పార్ట్‌నర్‌గా ఉండి చేతులు కాల్చుకుంది. కథలో సరైన క్లారిటీలేక సంగీతంలో రణగొన ధ్వనులతో చెవులు పగిలేలా హోరెత్తించిన సందీప్ చౌతా దెబ్బలకు బెంబేలెత్తేశారు.
ఇక సలీమ్ కథలోకి వస్తే.. అమెరికాలో పెరిగిన సత్యవతి (ఇలియానా) తన ఊరికి వస్తుంది. కానీ ఆమె తండ్రి నెపోలియన్‌ను విరోధులు వెంటాడుతుంటే మున్నాఉరఫ్ సలీమ్ (విష్ణు) ఆయన్ని రక్షిస్తాడు. అలా మొదటి పరిచయంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోసారి అనుకోకుండా ఆమెను కాపాడతాడు. ఆమె ఆ ఊరికి భూస్వామి నెపోలియన్ కుమార్తె.
ఆమె తండ్రికి ప్రత్యర్థి ముఖేష్‌రుషి వర్గానికి వైరం. అందుకే ఆమెను హత్య చేయడానికి వెంటాడుతుంటారు. ఈ నేపథ్యంలో మున్నాను సత్యవతి ప్రేమిస్తానని చెబుతుంది. సత్య ఇంట్లో ఆమెకు పెండ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఆ టైమ్‌లో విదేశీ గ్యాంగ్ ఆమెను ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అడ్డుపడిన మున్నాను గాయపరుస్తారు. ఆ సంఘటనలో మున్నాకు ఓ తెలుస్తుంది. తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ డ్రామా ఆడిందని మున్నాకు తెలుస్తుంది.
అప్పటికే విదేశాల్లో క్రిష్ అనే అతన్ని సత్యవతి ప్రేమిస్తుంది. అతడిని చేరాలంటే ఆమె ఇలా ప్లాన్ చేస్తోంది. క్రిష్ అక్కడ ఇంటర్నేషనల్ డాన్ ఓగిరాల జోగయ్య (ఓజో-మోహన్ బాబు) తమ్ముడే. దీంతో అతడ్ని ఢీ కొట్టడానికి సలీమ్‌ను ప్రేమిస్తున్నట్లు డ్రామా ఆడుతుంది. ఇది తెలుసుకున్న సలీమ్ సత్యవతికి ప్రేమ విలువ తెలియజేయాలనే పంతంతో విదేశాలకు వెళతాడు. మరి మున్నా ప్రయత్నం నెరవేరిందా? అసలు మున్నా అనేవాడు ఎవడు? అనేదే సినిమా సారాంశం.
విశ్లేషణ: విష్ణు 6 ప్యాక్ బాడీతో చాలా సన్నబడి బాడీని తగ్గించుకున్నా కళ్ళలోని ఛార్మ్ తగ్గి నీరసించినట్లున్నాడు. అయినా నటలో యాక్టివ్‌నెస్ బాగానే ఉంది. ఇక ఇలియానా తనను మొదట పరిచయం చేసింది వై.వి.ఎస్. చౌదరి అనేమో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఒకరకంగా దర్శకుడే ఆమెను కావాలని అలా చూపించి "దేవదాసు"లా యూత్‌ను బుట్టలో వేయాలని చూసి ఆయనే బుట్టలోపడిపోయాడు.
ఇక మోహన్‌బాబు పాత్ర చేయదగినకాకపోయినా పెద్దడాన్‌గా చేసి వెటకారపు డైలాగ్‌లతో, కావేరీఝాతో ఇంగ్లీష్ పాఠాలు చెప్పించుకుంటూ ఆమెను టీచ్‌చేసే విన్యాసాలు చీప్‌క్వాలిటీగా ఉన్నాయి. ఒక దశలో మోహన్‌బాబు నిజజీవితంలో అతని క్యారెక్టర్ ఇలా ఉంటుందని విమర్శకులు చెప్పింది కరెక్టేనేమోనని అనిపిస్తుంది.
బొడ్డుకింద చీరలు కన్పించి కన్పించని రవికల ధరించిన కావేరీ ఝా వెంట మోహన్‌బాబు పడటం వంటి సన్నివేశాలు వాటికి నిదర్శనంగా ఉన్నాయి.
వీటికి విష్ణు రివర్స్. హీరోయిన్ వెంటపడుతుంటే విష్ణు స్వాతిముత్యంలా తప్పించుకుంటాడు. ఇవన్నీ చూస్తే తెలుగు సినిమా పతనావస్థలోకి మారడానికి ఇటువంటి జిమ్మిక్కులే కారణమని సినిమా విశ్లేషకులు అంటున్నారు. నెపోలియన్ రోల్ బాగానే ఉంది. ముఖేష్‌రుషి పాత్ర అంతగా లేదు. మిగిలిన పాత్రలన్నీ వాటి పరిధిమేరకే నటించాయి.
సంభాషణల పరంగా చింతపల్లి రమణలో పసలేదు. సంగీతం హోరు ఎక్కువై చెవులు బెంబేలెత్తింపజేశాయి. 23 కోట్ల రూపాయలతో తీసిన సినిమాగా ప్రచారం జరిగింది. సినిమా చూశాక అంత రిచ్‌నెస్ ఎక్కడా కనబడదు. కథలేని సినిమాలో చెప్పేందుకు ప్రత్యేకించి ఏముంటుంది.? దేవదాసుతో పాటు హిందీ చిత్రాల ఛాయలు కన్పిస్తాయి. అర్థంపర్థంలేని కథ, కథనాలే సలీమ్ చిత్రం.