సాంకేతికత: నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి.
దర్శకత్వం: జీవన్‌రెడ్డి.
యూనివర్శిటీలు విద్యార్థుల భవితవ్వాన్ని తేల్చే దేవాలయాలు. అలాంటి దేవాలయాల్లో విద్యార్థులపై జరిగే దాడులు, అరాచకాలు, ప్రశ్నిస్తే దండెత్తే విధానం 1967లో మరింత ఎక్కువగా వుండేది. దేశంలో బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో కులవివక్షత, అణగారిన వర్గాలను తొక్కేయడం వంటివి జరిగేవి. అలాంటి సమయంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూవర్శిటీకి వచ్చిన జార్జ్‌రెడ్డి కథే ఈ చిత్రం. 'దళం' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ:
కేరళలో ఓ గ్రామంలో జార్జ్ తన తల్లితో వుంటాడు. తండ్రి లేడు. చిన్నతనంలో ప్రశ్నించే తత్త్వం అతనిది. పెద్దయ్యాక అది మరింత పెరుగుతుంది. అక్కడే కత్తివిద్యను అభ్యసిస్తాడు. ఇక యూనివర్శిటీ చదువుకై ఉస్మానియా వస్తాడు. అక్కడ హాస్టల్‌లో సోదరుడి గదిలో వుంటాడు. అక్కడ వాతావరణం అతన్ని కలచివేస్తుంది. విద్యార్థుల్ని హింసిస్తూ ఓ వర్గం వుంటుంది. కులం పేరుతో దూషించడం, మెస్‌లో సరైన భోజనం పెట్టకపోవడం వంటివి ఎన్నో జరుగుతాయి.
అలాంటి సమయంలో ప్రశ్నిస్తే తత్త్వం వున్న జార్జ్‌రెడ్డి వారిని ఎదుర్కొంటాడు. యూనివర్శిటీ పాలకవర్గం, పోలీసు వ్యవస్థకూడా జార్జ్‌కు అండగా వున్న విద్యార్థుల్ని చూసి జంకుతుంది. అయితే ఓ సందర్భంలో జరిగిన సంఘటనతో అతన్ని ఏడాదిపాటు అతని చదువుకు దూరం పెడుతుంది పాలకవర్గం.
హాస్టల్‌లోనే వుంటూ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు చదివి సమాజంలో జరిగే అరాచకాలు, అన్యాయాలపై పోరాడిన భగత్‌సింగ్, చెకువేరా.. ను స్పూర్తిగా తీసుకుంటాడు. ఏడాది తర్వాత యూనివర్శిటీ క్లాస్‌లకు వచ్చి అక్కడ జరిగే అన్యాయాల్ని ఎదిరించి నాయకుడిగా మారతాడు. అది సహించని ప్రత్యర్థివర్గం ఓ రాత్రి చంపేస్తుంది. ఇదీ కథ.
విశ్లేషణ:
యూనివర్శిటీ నాయకుడు చరిత్ర అంటే అందరికీ తెలిసిందే. అక్కడ జరిగే అన్యాయాలు, దోపిడీని ప్రశ్నించేవ్యక్తి. ఎవరూ ఊరికే నాయకుడు కాలేరు. అలాగే జార్జ్‌రెడ్డి నాయకుడుగా ఎదగడానికి చాలా కాలం పట్టింది. అయితే 1968లో వున్న పరిస్తితులే ఇప్పటికీ యూనివర్శిటీలో కొనసాగడం విశేషం. ఆమధ్య హైదరాబాద్‌లో యూనివర్శిటీలో జరిగిన అల్లర్లకు దేశం మొత్తం కదిలివచ్చింది.
ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. కులంపేరుతో, అంటరానివాడిగా దూషిస్తూ దూరంగా పెట్టే వ్యవస్థ ఆనాటికీ ఈనాటికి పెద్ద తేడాలేదు. అయితే అప్పట్లో యూనివర్శిటీ విద్యార్థులంతా ఆయనకు అండగా నిలవడం దానికి సంబంధించిన పరిస్థితులు బాగానే దర్శకడు డీల్ చేశాడు. కానీ కొన్నిచోట్ల లాజిక్కులు మిస్ అయ్యాడు.
ప్లస్‌పాయింట్లు..
- నటీనటులు, ఆహార్యం, వస్త్రధారణ, సైకిల్ వంటి వాహనాలు, బ్లేడ్‌తో జార్జ్ చేసే విన్యాసాలు
- నేపథ్య సంగీతం చిత్రానికి బలం
- యూనివర్శిటీ వాతావరణ, పోలీసు వ్యవస్థ చూపిన తీరు
- ప్రశ్నించే తత్తవంలో సందీప్ నటన
- కెమెరా, దర్శకుని పనితనం
లోపాలు:
- వాస్తవికతను కల్పితం చేయడంలో కొంత మిస్ అయ్యాడు. జార్జ్‌రెడ్డి ఎప్పుడూ చెప్పులతోనే తిరిగాడనేది పుస్తకాల్లో రాసి వుంది. కానీ చాలాచోట్ల బూట్లు ధరిస్తాడు.
- యూనివర్శిటీ సెట్లో కొన్నిచోట్ల లోపాలున్నాయి.
- ఇస్రో సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్ళి సెలక్ట్ అయ్యాక.. చేతికి ఆర్డర్ ఇస్తే.. ఆఫీసర్‌తో మాట్లాడకుండా వచ్చేస్తాడు. దానికి సరైన కారణం చూపించలేకపోయాడు. దాంతో ఇప్పటి తరానికి అర్థంకాదు అలా ఎందుకు చేశాడోనని.
- యూనివర్శిటీలో నాయకుడిగా ఎదగడానికి అక్కడి వాతావరణంతోపాటు అప్పడు దేశంలో బెంగాల్‌లో రైతుసమస్యలు, ఆంధ్రలో రైతుసమస్యలు వున్నాయి. వాటిని సరిగ్గా చూపించలేకపోయాడు.
- నగ్జలైట్‌వ్యవస్థ ప్రభావం కూడా సరిగ్గా చూపించలేకపోయాడు.
తీర్పు:
మొత్తంగా చూస్తే జార్జ్‌రెడ్డి విడుదలకు ముందే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాన్ని ఇప్పటి ట్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సిందే.