ప్రపంచం సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రోజుకొక కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, సౌండింగ్‌లో ఎన్నో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక యుగంలో వచ్చిన మూకీ చిత్రమే "మెర్క్యురీ". మూడు దశాబ్దాల క్రితం సంగీతం శ్రీనివాసరావు కలిసి 'పుష్పక విమానం' వచ్చింది. ఆ తర్వాత "ఫిజ్జా" ఫేమ్ కార్తీక్ సుబ్బురాజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే మెర్క్యురి చిత్రం. ఇది మూకీ చిత్రంకాగా, ఇందులో ప్రభుదేవా విలన్‌గా నటించడం మరో విశేషం. మరి ఈ మూకీ థ్రిల్లర్ చిత్రం కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
కథ :
మాటలు రాని, వినికిడి సమస్యతో బాధపడే ఐదుగురు స్నేహితులు. వీరంతా కలిసి ఓ అతిథి గృహంలో పుట్టినరోజు పార్టీ చేసుకుంటారు. పార్టీ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో వారు ఓ వ్యక్తిని కారుతో గుద్దుతారు. ఆ వ్యక్తి చనిపోతారు. చనిపోయిన వ్యక్తి గుడ్డివాడైన ప్రభుదేవా. అతన్ని స్నేహితులందరూ కలిసి ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పాతిపెడతారు. తర్వాత రోజు ఆ శవం పాతి పెట్టిన చోట కనపడదు. అలాగే ఐదుగురు స్నేహితుల్లో ఒక అమ్మాయి కనపడదు. ఇంతకు ఆ శవం ఏమైంది?. మాయమైపోయిన అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అసలు గుడ్డి వ్యక్తి చనిపోకుండా? ప‌్రతీకారం తీర్చుకున్నాడా? అనేదే ఈ చిత్రం మిగిలిన కథ.
సమీక్ష :
సాధారణంగా ఈ కాలంలో మూకీ సినిమాను తీయాలని ఎంచుకోవడమే ఓ సాహసం. పైగా, ఇలాంటి సినిమాని ఏ కోణంలో తెరకెక్కించాలన్న అంశంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చాలా తెలివిగా ప్రవర్తించాడు. పాత్రలకు మాటలు రావు.. చెవులు వినపడవు అని అనడంతో కథ వారి కోణంలో ఉంటుంది. కాబట్టి సినిమా మూకీ అనిపిస్తుంది. ప్రభుదేవాతో పాటు నటించిన అందరూ కొత్తవారు. అందరూ బాగానే నటించారు.
ముఖ్యంగా ఇప్పటివరకు నెగిటివ్ షేడ్‌లో నటించని ప్రభుదేవా.. తొలిసారి ఈ చిత్రంలో విలన్‌గా నటించడం ఈ చిత్రానికి బలం చేకూర్చినట్టయింది. సినిమాను ఎక్కువగా సాగదీయకుండా క్లుప్తంగా, సూటిగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ, సంతోశ్ నారాయణ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్.
అయితే, సినిమా ప్రారంభమైన కొంత సేపటికే కథ రివీల్ కావడంతో సినిమాపై ఉన్న ఆసక్తి ప్రేక్షకుడికి సన్నగిల్లుతుంది. ఇది మైనస్ పాయింట్ కావడం గమనార్హం. మొత్తంమీద 30యేళ్లకు ముందు వచ్చిన పుష్పక విమానం ఆకట్టుకుంటే ఇపుడు వచ్చిన మెర్క్యురీ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి నటీనటుల పనితీరు, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రభుదేవా నెగెటివ్ షేడ్, దర్శకుడి సరికొత్త ప్రయత్నం ప్లస్ పాయింట్స్ కాగా, కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.