గత చిత్రాలను గుర్తుకు తెచ్చే "పరిచయం'' మూవీ రివ్యూ

శనివారం, 21 జులై 2018 (15:24 IST)
నటీనటులు: విరాట్‌ కొండూరు, సిమ్రత్‌ కౌర్‌, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు 
సంగీతం : శేఖర్‌ చంద్ర 
నిర్మాత : రియాజ్‌ 
దర్శకత్వం : ల‌క్ష్మీకాంత్ చెన్నా 
విడుదల తేదీ : 21-07-2018 
 
గతంలో 'హైదరాబాద్ నవాబ్స్', 'నిన్నా నేడు రేపు' అనే చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా. చాలాకాలం తర్వాత 'పరిచయం' అనే సినిమాను తెరకెక్కించారు. అన్ని సినిమాల్లో కనిపించే ఆకతాయి తనం, అల్లరి, ప్రేమ విషయంలో బాధ్యతారాహిత్యం వంటివి మచ్చుకైనా లేకుండా స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ 'పరిచయం' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం కథ ఎలా ఉందో ఇపుడు చూద్ధాం.
 
కథ : 
ఈ చిత్రంలోని హీరో హీరోయిన్లు (విరాట్, సిమ్రత్ కౌర్‌) ఒకే రోజున, ఒకే హాస్పిటల్‌లో, ఒకే సమయంలో జన్మిస్తారు. ఇలా ఒకే సమయంలో జన్మించిన ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ ఉంటుంది. కానీ, వీరిద్దరు కాలేజీ చదివే రోజుల్లో కూడా వీరి ప్రేమ గురించి ఎక్కడా బయటపెట్టరు. ఒకరోజు తమ మనసులోని ప్రేమను చెప్పాలనుకునేలోపే పెద్దలు అడ్డుపడతారు. దీంతో సిమ్రత్ ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఫలితంగా ఆమె గతం మరిచిపోతుంది. 
 
అలాంటి పరిస్థితిలో కన్నబిడ్డను ఆస్పత్రిలోనే వదిలివేసి సిమ్రత్ తల్లిదండ్రులు వెళ్లిపోతారు. ఆ సమయంలో సిమ్రత్‌కు విరాట్ అండగా ఉంటాడు. అన్ని తానై ఆమెను రక్షించుకుంటాడు. మరి సిమ్రత్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? తిరిగి ఇద్దరు కలిశారా అన్నది మిగిలిన కథ. దీన్ని వెండితెరపైనే చూడాల్సివుంటుంది.
 
విశ్లేషణ : 
హీరోయిన్ గతం మర్చిపోతే.. ఆమెకు సేవ చేస్తూ.. గతం గుర్తుకు వచ్చేలా చేయడం వంటి కథలతో గతంలో సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు 'వసంత కోకిల'. 'ఆపద్బాంధవుడు'. ఇలా అనేక చిత్రాలు చెప్పుకోవచ్చు. ఇపుడు ఈ సినిమా కూడా గత పాత చిత్రాలను గుర్తుకు తెచ్చేలా ఉంది. ఇలాంటి సినిమాల కథలు నవలలో చదువుకోవడానికి బాగుంటాయి కానీ, తెరపై చూడాలి అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఎక్కడ కూడా బలమైన, బరువైన సన్నివేశాలు కనిపించలేదని చెప్పొచ్చు. 
 
చిత్రం తొలి అర్థభాగం అంతా హీరో హీరోయిన్ల ప్రేమ కథ చుట్టూనే తిరుగుతుంది. రెండో అర్థభాగంలో ఎమోషన్‌తో నడిపిద్దామని అనుకున్నా అది సాధ్యపడలేదు. ప్రేమకథా సినిమాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా హాస్యం ఉంటుంది. ఈ సినిమాలో హాస్య సన్నివేశాలు లేకపోవడం పెద్ద మైనస్ అయింది. పెద్దలకు ప్రేమ అంటే ఎందుకంత వ్యతిరేకమో అర్థంకాలేదు. ఆ కోపానికి కారణాలు ఏవి ఇందులో చూపించలేదు. 
 
హీరోయిన్ గతం కోల్పోయి పిచ్చిదానిలా ఆస్పత్రిలో ఉంటే తండ్రి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు అలా వదిలి వెళ్లిపోయాడో ఎవరికీ అంతుచిక్కదు. సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నా.. ఆ బిగుతును, ఉత్కంఠతను కొనసాగించలేకపోయాడు. ఒకానొక సమయంలో ముగింపు విషాదంగా మారుస్తాడా? అని అనిపిస్తుంది. చివరకు హీరో హీరోయిన్లకు కలిపి కథను సుకాంతం చేశాడు. 
 
నటీనటుల పనితీరు : 
హీరో హీరోయిన్లుగా చేసిన విరాట్, సిమ్రత్ కౌర్‌లు ఇద్దరు కొత్తవారే. కొత్తవారైనా వారి పరిధిమేరకు నటించారని చెప్పొచ్చు. ఎమోషన్ సీన్స్‌లో హీరో విరాట్ మెప్పించాడు. రాజీవ్ కనకాల, పృథ్విలు తప్పా మిగతా వారంతా కొత్తవారే. మిగతా పాత్రలలో ఎవరికి తగ్గట్టుగా వారు మెప్పించే ప్రయత్నం చేశారు.  
 
సాంకేతికం : 
ఈ సినిమాలో కొన్ని చోట్ల మెప్పించిన దర్శకుడు కొన్ని సీన్స్‌ను సాగదీసి బోర్ కొట్టించాడు. ముఖ్యంగా అరకు సీన్స్. శేఖర్ చంద్ర సంగీతం వినసొంపుగా ఉంది. పాటల చిత్రీకరణ బాగుంది. దర్శకుడు పాటలపై పెట్టిన దృష్టి, కథపై కూడా పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు