సంక్రాంతి రంగులు లేని రాట్నం.. "రంగులరాట్నం"... రివ్యూ రిపోర్ట్

ఆదివారం, 14 జనవరి 2018 (16:37 IST)
సినిమా: ర‌ంగుల‌ రాట్నం
న‌టీన‌టులు: రాజ్‌తరుణ్‌, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి త‌దిత‌రులు
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం: శ్రీరంజని
విడుదల తేదీ: జనవరి 14, ఆదివారం. 
 
'ఉయ్యాల జంపాల' సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయమైన రాజ్‌ తరుణ్‌ సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి అదే బ్యానర్‌లో నటించిన సినిమా 'రంగుల రాట్నం'. శ్రీ రంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగో చిత్రం. 
 
తక్కువ వ్యయంతో కూడిన చిత్ర‌మే అయినప్పటికీ కీల‌క‌మైన సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల కావ‌డం... వినూత్నమైన క‌థ‌ల్ని ప్రోత్సహించే అన్నపూర్ణ సంస్థలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. శ్రీరంజ‌ని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి బొబ్బట్టులా ఉంటుంద‌ని నిర్మాత నాగార్జున చెప్పడంతో పాటుగా... ప్రచార చిత్రాలు కూడా ఆక‌ట్టుకొనేలా ఉండ‌టంతో 'రంగుల‌రాట్నం' సినీ ప్రేమికుల దృష్టిని ఆక‌ర్షించింది. ఆదివారం విడుదలైన ఈ చిత్ర కథను విశ్లేషిస్తే... 
 
కథ.. 
విష్ణు (రాణ్ తరుణ్) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లి (సితార)తో కలిసి ఉంటాడు. కొడుకే తన లోకంగా భావించే సితార ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో కీర్తి(చిత్ర శుక్లా) అనే అమ్మాయి రాజ్‌తరుణ్‌ కంటపడుతుంది. ఆమె ప్రేమలో పడిపోతాడు. తన తల్లికి కూడా పరిచయం చేస్తాడు. అనుకోకుండా సితార చనిపోతుంది. దాంతో విష్ణు గురించి అన్నీ తెలిసిన కీర్తి అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే అతి జాగ్రత్తగా వ్యవహరించే అలవాటున్న కీర్తి.. విష్ణుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆ అతి జాగ్రత్త విష్ణుని ఏ రకంగా బాధపెట్టింది? అసలు ఆమెకి ఆ జాగ్రత్త అలవాటు ఎలా వచ్చింది? వాళ్లిద్దరి పెళ్లి జరిగిందా? లేదా? తదితర విషయాలు తెరపై చూడాలి.
 
ఎలా ఉందంటే..?
ఏ విషయాన్నైనా లైట్‌గా తీసుకునే ఓ అబ్బాయి ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించే ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథే ఈ రంగులరాట్నం. భిన్నమైన నడవడికలు ఉన్న వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారనే ఇతివృత్తంతో చిత్రాన్ని తీర్చి దిద్దారు. తొలి సగభాగం తల్లీ కొడుకు బంధం నేపథ్యంలో సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుంది. తల్లీకొడుకు, ఓ అమ్మాయి, ఓ స్నేహితుడు.. ఈ నాలుగు పాత్రల చుట్టూనే సన్నివేశాలను తీర్చిదిద్దారు. విరామం సమయానికి కథానాయకుడి తల్లి మరణించడంతో కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. 
 
దీంతో ద్వితీయార్ధంలోనైనా కథ, పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుందేమో అని ఆశించిన ప్రేక్షకుడికి అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ, కథనాలపై ఏమాత్రం కసరత్తు చేయకపోవడంతోపాటు సన్నివేశాలన్నీ ఫ్లాట్‌గా ఉండడంతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఉంటుంది. తరుణ్‌, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు కాస్తలో కాస్త ఉపశమనం. అక్కడక్కడా ఇద్దరూ కలిసి నవ్వించారు. పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.
 
గత ఏడాది 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంధగాడు' లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ కొత్త ఏడాదిలో 'రంగుల రాట్నం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకు అలవాటైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవటంతో నటుడిగా పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. సెంటిమెంట్ సీన్స్‌లో మాత్రం మంచి పరిణతి కనబరిచాడు. 
 
హీరోయిన్‌ చిత్రా శుక్లా పరవాలేదనిపించింది. తల్లి పాత్రకు సీనియర్ నటి సితార ప్రాణం పోసింది. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ ప్రియదర్శి కామెడీ కాస్త నవ్విస్తుంది. ఇంతకుమించి పెద్దగా చెప్పుకునే అంశాలు చిత్రంలో ఎక్కడా కనిపించవు.  మొత్తంమీద ఈ చిత్రంలో కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకునే టచింగ్ పాయింట్ లేకపోవడం నిరాశకు గురిచేసే అంశంగా చెప్పుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు