రైట్‌రైట్.. అనేది సినిమా.. మలయాళ 'ఆర్డినరీ'కి రీమేక్. అక్కడ ఫర్వాలేదు అనిపించేలా ఆడిన ఈ సినిమాను రైట్స్‌కొని.. రైట్ రైట్ అని పేరు పెట్టారు దర్శక నిర్మాతలు. హీరోగా సుమంత్ అశ్విన్‌కు పెద్దగా చెప్పుకోదగిన సినిమా రాలేదు. అంతకుముందు ఆ తర్వాత, కేరింత... వంటి చిత్రాల్లో ఫర్వాలేదు అనిపించినా పూర్తిస్థాయి హీరోగా తనేంటో నిరూపించుకోవాలని.. సేఫ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా చేశాడు. ఎం.ఎస్. రాజు తనయుడు కాబట్టి.. అన్ని హంగులు సమకూరాయి. మరి తననుకున్న రేంజ్‌కు ఈ సినిమాతో వెళ్ళాడాలేదా? చూద్దాం.
కథ:
పగలు కూడా కలలుకంటూ ఎస్‌ఐ. అవ్వాలనుకునే ఇ.రవి (సుమంత్ అశ్విన్)కి కండెక్టర్ ఉద్యోగం వస్తుంది. శ్రీకాకుళంలోని గవిటి టు ఎస్.కోట అనే మారుమూల ప్రాంతంలో ఒకేఒక్క ట్రిప్ వెళ్లే బస్‌కు తను కండక్టర్. డ్రైవర్ ప్రభాకర్. పొద్దస్తమానం తాగుతూనే వుంటాడు. అయినా డ్యూటీ చేస్తాడు. ఎస్.కోటలో కళ్యాణి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే ఊరి సర్పంచ్ నాజర్ కొడుకు ఉత్తరాదిలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి తన బంధువైన మధుకిచ్చి పెండ్లిచేయాలనుకుంటాడు.
రెండురోజుల్లో పెండ్లి ఏర్పాట్లు జరుగుతున్నదనగా... కొడుకు చనిపోయాడనే వార్త నాజర్‌ను కుంగదీస్తుంది. దానికి కారణం.. రవి, ప్రభాకర్‌లే అన్న నిజం ఊరంతా తెలిసి చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. అయితే తమ బస్సుకింద పడ్డా బతికేవున్న నాజర్ కొడుకును ఆసుపత్రికి తీసుకెళితే ఎలా చనిపోయాడనేది అర్థంకాక... బెయిల్‌పై బటయకు వచ్చాక... ఆ కోణంలో రవి, ప్రభాకర్‌లు తమ కోణంలో పరిశోధిస్తారు. చివరికి చంపిన వ్యక్తిని కనిపెడతారు. ఆ వ్యక్తి ఎవరు? అనేది సినిమా.
పెర్‌ఫార్మెన్స్..
సుమంత్ అశ్విన్ బాడీ లాంగ్వేజ్ లవర్‌బాయ్‌లా వుంటుంది. కానీ.. తను యాక్షన్ సీన్స్ చేస్తుంటే కామెడీగా వుంది. నటన పరంగా పెద్దగా చేసింది లేదు. ఇంకా మెరుగుపర్చుకోవాలి. పూజా జవేరి, పావని గంగిరెడ్డి పాత్రలు నటనకు అవకాశంలేనివే.. ఏదో సాదాసీదాగా నటిస్తేచాలు. సుమంత్ అశ్విన్ తల్లిగా సుధ, నాజర్ భార్యగా రాజ్యలక్ష్మి నటించారు. మిగిలిన పాత్రలు కొత్తవారు పోషించారు.
టెక్నికల్‌గా...
సాంకేతికంగా చెప్పాల్సింది.. కెమెరా.. అరకు, ఒరిస్సా బోర్డర్ ప్రాంతాల అందాల్ని బాగానే చూపించాడు. సంగీపరంగా జెబి.. ఇచ్చిన ట్యూన్స్ కొత్తగా ఏమీలేవు. అలా అని తీసేవికూడా కాదు. ఈ సినిమాకు ఇంతకంటే చాలు అన్నట్లుగా వుంటాయి. సంభాషణలపరంగా ఎక్కడా పంచ్‌లు లేవు. సాదాసీదా డైలాగ్‌లు.. శ్రీకాకులం యాస మాత్రం ప్రభాకర్ పాత్రలోనే కన్పిస్తుంది. గ్రాఫిక్స్.. ఈ చిత్రానికి వుపయోగించినా.. అవి అంతగా అవసరంలేదనిపిస్తుంది.
విశ్లేషణ:
సినిమా కథ. పెద్దగా ఏమీ లేదు. మలయాళంలో హిట్టయిన సినిమా.. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ వసూలు చేసిందనే ఒక్క లాజిక్కుతో ఆ చిత్రాన్ని రీమేక్ చేశారు. సినిమా చూశాక.. అంతగా రీమేక్ చేయాల్సిన అవసరం ఏముందనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. ఏదో కండెక్టర్ పల్లెటూరి బస్‌లో జర్నీ చేస్తున్నాడు.. మధ్యలో కొన్ని క్యారెక్టర్లు బస్ ఎక్కుతాయి.. అక్కడే హీరోకు లవ్ ట్రాక్.. ఓ హత్య కేసులో హీరో ఇరుక్కోవడం.. చివరికి తను అది చేయలేదని నిరూపించుకోవడం... క్లుప్తంగా కథ ఇది. ఈ కథను 12 ఏళ్ళక్రితం తమిళంలో ఓ సినిమా వచ్చింది. పేరు గుర్తులేదుకానీ.. బస్ బ్యాక్‌డ్రాప్ ఒక్కటే మార్పు. మిగతాదంతా సేమ్‌టుసేమ్..
ఊరి సర్పంచ్ నాజర్ ఇంటిలో అన్ని పనులు చేసే నమ్మకస్తుడు.. నాజర్ కొడుక్కి స్నేహితుడు అయిన వ్యక్తే హంతకుడు.. ఎందుకు చేశాడు? అంటే.. తన స్నేహితుడు పెండ్లి చేసుకోవాల్సిన అమ్మాయిపై ఇతను మోజు పడ్డాడు. ఆమె తనకు దగ్గకపోతే సైకోలా మారతాడు.. ఈ కథ పాతచింతకాయ పచ్చడి. దానికోసం రీమేక్ రైట్స్ కొనుక్కుని చేశానని గొప్పలు చెప్పుకోవడం.. అందుకోసం ఖర్చు చేయడం.. అనేది.. ఇప్పటి నిర్మాతల అనాలోచిత నిర్ణయానికి నిదర్శనం. కోట్లు ఖర్చుపెట్టే నిర్మాత.. కనీసం సినిమా కథలు ఎలా వుండాలి. అనేది గ్రహించుకోవాలి. ఇక దర్శకుడు మను.. కొత్తవాడైనా.. తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు. కమల్‌హాసన్, మోహన్‌లాల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వారి సినిమాలు చేశాడు గనుకనే... తెలుగులో ఈజీగా ఎంట్రీ లభించింది. అలాంటప్పుడు తెలుగు నేటివిటీ... నాడి. వాడి.. తెలుసుకుని.. సినిమా చేస్తే బాగుండేది.. ఏ షాట్‌లో దర్శకుడి ప్రతిభ కన్పించదు. ఏం తీసాడుర్రా షాట్! అనిపించేలా ఏదీ వుండదు.
ప్రకృతి అందాల్ని యతాథంగా చూపిస్తే ఇంకా బాగుండేది. సినిమా ఆరంభం నుంచి టైటిల్స్ పూర్తయ్యేవరకు గ్రాఫిక్స్‌లో కలర్స్ గ్రేడింగ్ చేసి.. రోడ్లు, చెట్లు, కొండలు.. ఫుల్ కలర్‌లో చూపించేసి ఉన్న అందాలను చెడగొట్డాడు. ఇక్కడే.. దర్శకుడు ప్రతిభ ఏమిటో తెలిసిపోతుంది. కానీ. ఇవే కొత్తగా భావించి.. తీసిన నిర్మాతను అభినందించాల్సిందే. ఏతావాతా ఈ సినిమా ఉపయోగపడింది.. కేవలం బాహుబలి ప్రభాకర్‌కే. క్రూరంగా బాహుబలిలో చూసిన.. వ్యక్తిని.. సాప్ట్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తాడనేలా ఈ సినిమా వుంది. వెరసి ఈ సినిమా బిలో ఏవరేజ్.